తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. యాగశాల వద్ద ఉదయం నుంచి వేదపండితులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి మధు ఈవెంట్స్ ఆర్‌డీఎక్స్ టీమ్ (వైజాగ్), మణిపూర్ స్టంట్స్, డాన్స్ బేబి డాన్స్ నిర్వహించారు. ప్రేక్షకులు, భక్తులు విశేషంగా హాజరైయారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు పర్యవేక్షించారు.
వేలేరుపాడు: మండల పరిధిలోని జిన్నెల గూడెం గ్రామానికి చెందిన తురసం ధనుష్ అనే మూడేళ్ల గిరిజన బాలుడు మంగళవారం మధ్యాహ్నం పాము కాటుకు గురై మృతి చెందాడు. తల్లిదండ్రులు రవి, లక్ష్మిలు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ధనుష్ ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో నాగుపాము మోకాళ్ల దగ్గర కాటు వేసింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు నాగుపామును కొట్టి చంపారు. అనంతరం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో ధనుష్ మృతి చెందాడు. రవి, లక్ష్మిలకు ముగ్గురు సంతానంలో కుమారుడు మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రముఖ వచన కవి పట్టణానికి చెందిన వేమూరి శ్రీనివాస్‌కు పరాభవనామ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. వేమూరి వృత్తి గణిత శాస్త్ర బోధన కాగా ప్రవృత్తి కవితా రచన. తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకోనున్నారు.
గణపవరం: పిప్పరలో ఉండిపంటకాలువలో ఈతకు దిగి మృతిచెందిన వారిలో ప్రమోద్‌వర్మ మృతదేహం మంగళవారం ఉదయం లభించింది. మూడు రోజులుగా రెస్క్యూ టీం సభ్యులు ఉండి పంటకాలువ పొడవునా కిలోమీటర్ల దూరం వరకూ మృతదేహం కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయం ప్రమోద్‌వర్మ మృతదేహం లభించినట్లు గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్‌వర్మ(11) అనే ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకోసం కాలువలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమోద్‌వర్మ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గణపవరం: ఏలూరు జిల్లా గణపవరం సెంటర్‌లో ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. వారిని మంగళవారం తాడేపల్లిగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ కె.లలితాదేవి ముగ్గురికీ ఒక్కొక్కరికీ పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
నరసాపురం రూరల్: చేపల వేటకోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవిగా తేలడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమాని రాము (19) ఆదివారం ఉదయం వేటకోసం ఉప్పుటేరుకు వెళ్లాడు. అయితే సాయంత్రం దాటినా రాము ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం కాళీపట్నం ఈస్ట్ లోని లాంచీల రేవువద్ద రాము మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


