అధికారుల విజ్ఞప్తి
● మెట్ట ప్రాంతంలో విస్తరిస్తున్న శిలీంధ్ర వ్యాధి
● నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
చింతలపూడి: గత కొద్ది రోజులుగా మెట్ట ప్రాంతంలోని వేప చెట్లు నిలువునా ఎండిపోతుండడం స్థానికంగా కలకలం రేపుతోంది. పచ్చగా ఉండాల్సిన చెట్లు అకస్మాత్తుగా కొమ్మల పైభాగం నుంచి ఎండిపోతూ వస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం ఏదైనా అరిష్టమా అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని, ఇది కేవలం ‘డై బ్యాక్’ అనే శిలీంద్ర వ్యాధి మాత్రమేనని ఉద్యాన శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏమిటీ డై బ్యాక్ వ్యాధి?
ఇది ఫోమోప్సిస్ అజాడిరక్టే అనే ఫంగస్ (శిలీంధ్రం) వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు చెట్టు కొమ్మలు పైనుండి కిందికి ఎండిపోతూ వస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, పూత రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఈ శిలీంధ్రం వేగంగా విస్తరిస్తుంది.
శాసీ్త్రయ నివారణ మార్గాలు
మూఢనమ్మకాలతో చెట్లను వదిలేయకుండా, సరైన సమయంలో చికిత్స అందిస్తే వేప చెట్లను కాపాడుకోవచ్చని ఉద్యానాధికారిణి ఎండి షాఫియ సూచిస్తున్నారు. ఒక లీటరు నీటిలో 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల మాంకోజెబ్ కలిపి చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి, ఆ భాగంలో బోర్డో పేస్ట్‌ను పూయడం వల్ల వ్యాధి మరింత వ్యాపించకుండా ఆపవచ్చు. చెట్టు మొదట్లో తగినంత నీరు పోస్తూ, పోషకాలు అందించినట్లయితే మళ్లీ కొత్త చిగుళ్లు వచ్చే అవకాశం ఉంది.
వేప చెట్లు ఎండిపోవడం అనేది పూర్తిగా జీవశాస్త్ర పరమైన సమస్య. దీనికి గ్రహగతులకు లేదా అరిష్టాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతులు, ప్రజలు ఆందోళన చెందకుండా ఉద్యాన అధికారుల సలహాల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


