గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు దుర్మార్గం

Mar 18 2026 11:10 AM | Updated on Mar 18 2026 11:10 AM

నూజివీడు: ఆగిరిపల్లి మండలంలో అధికారపార్టీ నాయకులు అత్యంత దారుణంగా పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో వాటి యజమానులకు తెలియకుండానే మామిడి చెట్లు నరికివేసి గ్రావెల్‌ తవ్వకాలు జరిపి తరలించడం అత్యంత దుర్మార్గమని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. కలటూరుకు చెందిన గుద్దేటి వరదానానికి 30 ఏళ్ల క్రితం ప్రభ్వుత్వం 1.96ఎకరాలు అసైన్‌మెంట్‌ భూమి ఇవ్వగా, ఆమె మరణించిన తర్వాత దానిని ఆమె ముగ్గురు కుమారులు సాగు చేసుకుంటున్నారు. అందులో 50 మామిడి చెట్లు ఉన్నాయి. ఆమె కుమారుల్లో ఒకరైన గుద్దేటి రమేష్‌ తన భార్య అనారోగ్యానికి గురవ్వగా నాలుగు రోజుల పాటు విజయవాడలోని ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించి తీసుకొచ్చేసరికి 50 చెట్లు నరికివేయడంతో పాటు అందులోకి అక్రమంగా ప్రవేశించి గ్రావెల్‌ను తవ్వేశారు. దీనిపై బాధిత రమేష్‌ ప్రతాప్‌ అప్పారావును ఆశ్రయించగా మంగళవారం బాధితుడిని వెంటబెట్టుకుని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంకు తీసుకెళ్లగా నక్కనబోయిన వేణు, దాసరి శేషగిరిరావు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని సబ్‌కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్నకు బాధితుడు ఫిర్యాదు చేశారు.

తారాస్థాయికి అక్రమ తవ్వకాలు

అనంతరం ప్రతాప్‌ అప్పారావు విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో మంత్రి అండదండలతో కొందరు నాయకులు గుట్టలు, చెరువులు కొల్లగొడుతున్నారన్నారు. ఆగిరిపల్లి మండలంలో అయితే కొల్లగొట్టడం తారాస్థాయికి చేరిందన్నారు. ప్రకృతి సంపదైన గుట్టలన్నీ కనుమరుగైపోయే పరిస్థితి నెలకొందన్నారు. దళితుడి భూమిలోని గ్రావెల్‌ను తవ్వి టిప్పర్లలో విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారన్నారు. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నా తహసీల్దార్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిరిపల్లి మండలంలో కనసానపల్లి, అమ్మవారిగూడెం, నర్సింగపాలెం తదితర గ్రామాల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. కనసానపల్లిలో అనుమతినిచ్చిన క్వారీ ఉండగా అందులో అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే రెండు రెట్లు ఎక్కువగా తవ్వేసి గ్రావెల్‌ను తరలించారని, దీనిని తనిఖీలు చేసి అదనంగా తవ్విన దానికి నిబంధనల ప్రకారం క్వారీ అనుమతి పొందిన వ్యక్తికి జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎమ్మార్‌ అప్పారావు, కోటగిరి హనుమంతరావు, పాలడుగు వెంకట్రావు, తాను, చిన్నం రామకోటయ్యలు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఏ ఒక్కరి హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరగలేదని, వారు ఎన్నడూ ప్రోత్సహించలేదన్నారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు టిప్పర్లతో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ను తరలిస్తూ కొండలను, గుట్టలను, చెరువులను కొల్లగొడుతున్నారని, ఈ అక్రమ గ్రావెల్‌ దందాను కచ్ఛితంగా నిలువరించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. ప్రతాప్‌ అప్పారావుతో పాటు వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, కలటూరు సర్పంచి సురేష్‌ తదితరులు ఉన్నారు.

మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement