తణుకు అర్బన్: ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తణుకు రహదారుల్లో మైనర్లు తమ వాహనాలతో చేసిన సౌండ్ పొల్యూషన్ తాకిడికి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రకరకాల ద్విచక్ర వాహనాలపై మైనర్లు ముగ్గురేసి ఎక్కి వాహనాలు నడిపిన తీరు భయబ్రాంతులకు గురిచేసింది. వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సైలెన్సర్‌ల నుంచి విపరీతమైన శబ్దాలు వచ్చే విధంగా నడిపిన తీరుతో పాదచారులు భయపడిపోయారు. బండి వెనుక బండితో మైనర్లు రేస్‌లు పెట్టుకున్నట్లుగా ప్రయాణించడంతో తణుకులో ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, వేల్పూరు రోడ్డులో ప్రయాణికులు గగ్గోలెత్తిపోయారు. కళాశాలల వద్ద పరీక్షలు అయిన తరువాత మైనర్లు, ఆకతాయిలు ఆడపిల్లల వెనుక వాహనాలతో ప్రయాణించిన తీరుతో చూసేవారికి చమటలు పట్టించాయి. ఇటీవల కాలంలో ఈ తరహా వాహనాల జోరు అధికం కాగా పోలీసులు వాహనాలను ఆపి నిలువరించిన వెంటనే రాజకీయ సిఫార్సులు నిముషాల వ్యవధిలోనే వస్తుండడంతో కేవలం కౌన్సెలింగ్‌లతో సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా నేనెవరో తెలుసా అంటూ పోలీసులనే ప్రశ్నించే పరిస్థితుల్లో మైనర్లు ఉండడం శోచనీయం. మంగళవారం మధ్యాహ్నం తణుకు శివారు ఉండ్రాజవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధూళిపాల వీవీసీఎస్ శర్మ ఘటనా ప్రాంతంలోనే మృతిచెందారు. భోజన విరామ సమయంలో తణుకులోని నివాసానికి వస్తున్న శర్మను ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడ్ చేస్తూ వేగంగా వస్తున్న యువకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
కొరడా ఝళిపించిన పోలీసులు
ఉదయం నుంచి మైనర్లు వాహనాలతో చేసిన రచ్చతో విసుగెత్తిన పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం తణుకు రాష్ట్రపతి రోడ్డులో యువకులు, మైనర్లు ప్రయాణించే వాహనాలను పదుల సంఖ్యలో నిలువరించి వాహనాల తాలూకా దస్త్రాలను తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు డి.ఆదినారాయణ, కె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వాహనాలను నిలువరించారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తణుకు ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ హెచ్చరించారు రాష్ట్రపతి రోడ్డులోని డిగ్రీ కళాశాల వద్ద మైనర్లు, విచిత్ర శబ్ధాలు చేస్తూ సైలెన్సర్లు లేకుండా నడుపుతున్న మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
ఉండ్రాజవరంలో వాహనం ఢీకొని
ప్రభుత్వ ఉద్యోగి మృతి


