అధికారం అండతో పొట్టగొట్టారు | - | Sakshi
Sakshi News home page

అధికారం అండతో పొట్టగొట్టారు

Mar 17 2026 7:42 AM | Updated on Mar 17 2026 7:42 AM

దళిత రైతుపై దారుణం

మామిడి తోట నరికేసి.. గ్రావెల్‌ తరలించుకుపోయిన వైనం

ఆగిరిపల్లి (ఏలూరు): అధికారం ఉందనే అహంకారంతో, మంత్రి పార్థసారథి అండ చూసుకుని నిరుపేద దళిత రైతు రమేష్‌ మామిడి తోట నరికేయడంతోపాటు అందులోని గ్రావెల్‌ అక్రమంగా తవ్వేసి లారీల్లో తరలించుకుని సొమ్ము చేసుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతుకు మద్దతుగా టీడీపీ నేతల దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల రెవెన్యూ పరిధిలో వలస గట్టు దిగువన ఉన్న దళిత రైతు గుడ్డేటి రమేష్‌కు చెందిన ఎకరం 96 సెంట్ల మామిడి తోటను రైతు ఊరిలో లేని సమయంలో అధికార పార్టీ నాయకులు వారం రోజుల నుంచి నరికేసి... జేసీబీలతో గ్రావెల్‌ తవ్వి లారీల్లో తరలించి సొమ్ము చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమాచారం తెలుసుకున్న నూజివీడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం రైతు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ రైతు మామిడి తోటను నాశనం చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్‌ చేసి, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మంత్రి అండదండలు చూసుకుని మండలంలో విచ్చలవిడిగా గ్రావెల్‌ తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌తో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మామిడి తోట ఎందుకు నరికారని రైతు ప్రశ్నిస్తే.. ‘మామిడి తోట కొన్నాను.. ఇది నాది’ అంటూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు బాధిత రైతును బెదిరిస్తున్నాడని చెప్పారు. ‘ఒకవేళ వేణు కొంటే రైతు దగ్గర పట్టాదారు పాసుపుస్తకం ఎలా ఉంది’ అని వారు ప్రశ్నించారు.

ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి మామిడి తోటను ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేయించి, నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలిని సందర్శించినవారిలో వైఎస్సార్‌సీపీ నేతలు శీలం రాము, పావన జ్యోతి సుజన కుమారి, పోలిమెట్ల శివ, పిల్లా చరణ్‌, భాస్కర్‌ ప్రసాద్‌, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement