ఉండి: ఒకవైపు జిల్లా ఉన్నతాధికారులు ఆక్వాచెరువుల తవ్వకానికి అనుమతులు లేవంటున్నా.. మండలంలో చెరువుల తవ్వకం మాత్రం ఆగడం లేదు. ఇదేంటని ఎవరైనా అడిగితే మాత్రం ఎప్పుడో చెరువు తవ్వుకునేందుకు అనుమతులు తీసేసుకున్నాం అంటున్నారు. ఉండి మండలం పెదపుల్లేరులో ఇటీవలే ఆక్వాచెరువు తవ్వారు. ఏకంగా ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్ వరకు తవ్వకం చేశాడు. చెరువు రోడ్డు మార్జిన్‌ను ఆనుకుని ఉండటంతో వాహనదారులు ఆందోధోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో చీకటిగా వుండటంతో ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. ఈ రహదారి పెదపుల్లేరు గ్రామం నుంచి ప్రారంభమై శివారు ప్రాంతం మేడవరం మీదుగా కాళ్ళ మండలం కోమటిగుంట, సీసలి గ్రామాలలో నుంచి జువ్వలపాలెం రాష్ట్ర రహదారికి చేరుకుంటుంది. కాళ్ళ మండలంలోని రెండు గ్రామాలతో పాటు ఉండి, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణాలు సాగిస్తుంటారు. దీనిపై సిబ్బందిని ఆరాతీయగా సదరు రైతుకు అనుమతి ఉందంటూ సమాధానమిచ్చారు. సదరు రైతు కూటమి పార్టీకి చెందినవారని సమాచారం. సాధారణ ప్రజలు రోడ్డు పక్కగా నివాసముంటేనే ఆక్రమణలు అంటూ తొలగించేస్తున్నారు.. మరి కూటమి నాయకులు రోడ్డుకు చేర్చి చెరువులు తవ్వేస్తే పట్టించుకోరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మత్స్యశాఖ అధికారి ఎఫ్‌డీఓ సీహెచ్ రాంబాబును ఆరా తీయగా తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని గతంలో అనుమతి తెచ్చుకుంటే మాత్రం ఐదేళ్ళ వరకు వ్యాలిడిటీ ఉంటుందని తెలిపారు. నిబంధనల మేరకు తవ్వకం చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. పెదపుల్లేరు చెరువును పరిశీలిస్తానని అన్నారు.


