ఏలూరు (టూటౌన్): జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఏలూరులో మాట్లాడుతూ జూన్ 3న వేలాది మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ, మూడు రోజులపాటు 500 మంది రైతు ప్రతినిధులతో ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. జిల్లాలో అన్ని పంటల రైతుల సమస్యలపై, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర రైతాంగ సమస్యలపై సదస్సులు, సెమినార్ లు నిర్వహిస్తామని చెప్పారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార జాతా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ఎగుమతులు నిలిచిపోయి రాష్ట్రంలోని వివిధ పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. ఆక్వా, మామిడి, మొక్కజొన్న, కోకో, పొగాకు, అరటి తదితర పంటల రైతులు నష్టపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారులు, ఇంకా అనేక రూపాలలో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆగిరిపల్లి మండలంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకష్ణారావు, ఉపాధ్యక్షుడు సిరి బత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


