భీమవరం: ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆక్వా రంగానికి తీవ్ర నష్టం ఏర్పడిందని ఫీడ్ ధరలు పెంచేసి రొయ్యలు, చేపలు రేట్లు తగ్గించేశారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు పాతపాటి మురళీరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో సమితి గౌరవాధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద నిర్వహించిన రైతు కార్యాచరణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యలు, చేపల ఎగుమతులు నిలిచిపోవడాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరలు తగ్గించారన్నారు. మరో పక్క మేత ధరలు రోజు రోజుకు పెరిగిపోవడం పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మురళీరామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దం మరిన్ని రోజులు కొనసాగుతాయంటూ వ్యాపారులు ప్రచారం చేసి తక్కువ కౌంట్‌లోనే రొయ్యల పట్టుబడిపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఆక్వారంగాన్ని ఆదుకోవాలని మురళీరామరాజు కోరారు. ఈ సమావేశంలో పీఎ రామకృష్ణరాజు, సమితి ప్రధాన కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు, కోశాధికారి గొట్టుముక్కల భీమరాజు తదితరులు పాల్గొన్నారు.


