ప్రక్షాళన చేస్తున్నాం
భారీ ఎత్తున అక్రమాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించరాదని దేవదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలయంలో అక్రమాలు, అవకతవకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి క్షేత్రంలో పర్మినెంట్ ఉద్యోగులు సు మారు 70 మంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 160 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అధికారులు నగదు లావాదేవీలు జరిగే కీలక విధుల్లో నియమిస్తున్నారు.
సర్క్యులర్ ఏం చెబుతోందంటే..
2020లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ విధానం అమలులో ఉన్న ఆర్‌జేసీ, డీసీ, ఏసీ కేడర్ ఆలయాల్లో నగదు లావాదేవీలు జరిగే అన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా రెగ్యులర్ సిబ్బందిని నియమించాలి. అయితే చిన వెంకన్న క్షేత్రంలో మాత్రం కీలక ప్రదేశాల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నా.. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేయిస్తున్నారు. అలాగే ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగులందరినీ రొటేషన్ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేయాలన్న నిబంధనలు ఇక్కడ సక్రమంగా అమలు కావడం లేదు.
రాత్రికి రాత్రే ఆర్డర్ మార్చి..
గతంలో కొందరు ఉద్యోగులతో పాటు ఆలయ ప్రధాన కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో పనిచేసి, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎస్‌జే రాజు, రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్‌లో పనిచేసిన శేషు అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మూడు నెలల క్రితం మనమిత్రా ప్రసాదం కౌంటర్ వద్ద నియమించారు. ఆ ఆర్డర్ కాపీని సదరు ఇద్దరు ఉద్యోగులకు, అంతర్గత బదిలీ అయిన మిగిలిన వారికి కూడా ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే మళ్లీ ఆర్డర్‌ను మార్చి రాజును రూ.100 టికెట్ కౌంటర్‌కు, అలాగే శేషును రూ.200 కౌంటర్‌కు (అంటే పాత స్థానానికి) మార్చిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కావాలనే ఓ ఉద్యోగి తనకు నచ్చిన వారిని ఇలాంటి కీలక ప్రదేశాల్లో నియమించి దందాకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంది.
శ్రీవారి ఆలయంలో అవినీతిని ప్రక్షాళన చేస్తున్నాం. స్వామివారి సొమ్మును స్వాహా చేసే ఏ ఒక్కరినీ విడిచిపెట్టం. రాష్ట్రంలో అవినీతిరహిత ఆలయంగా చిన్నవెంకన్న దేవస్థానాన్ని తీర్చిదిద్దుతాం.
– ఎస్వీ సుధాకరరావు, శ్రీవారి దేవస్థానం చైర్మన్
నగదు లావాదేవీలు జరిగే చోట అవుట్ సోర్సింగ్ సిబ్బంది
వారిని నియమించొద్దని గతంలోనే సర్క్యులర్ జారీ
అయినా పట్టించుకోని ఆలయ అధికారులు
రాత్రికి రాత్రే అంతర్గత బదిలీల ఆర్డర్ మార్చేసిన వైనం
అధికారుల తీరుతో కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీవారి ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అవినీతి బయటపడిన సందర్భాల్లో కొద్ది రోజులు తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి, మళ్లీ పెద్దల సిఫార్సులతో విధుల్లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.500 అంతరాలయ దర్శనం టికెట్ల రీప్రింట్‌పై గతనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు, ఆలయ చైర్మన్ నిఘాను పెంచడంతో అక్రమాలకు చెక్ పడి దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. ఇదే క్రమంలో గత ఆదివారం రూ.200 టికెట్ కౌంటర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్‌జే రాజు సుమారు 61 నకిలీ దర్శనం టికెట్టు విక్రయించినట్టు గుర్తించిన అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. అయితే రూ.100 టికెట్ కౌంటర్‌లోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు బయటపడొచ్చని పలువురు అంటున్నారు.


