పది పరీక్షలు ప్రారంభం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్షకు 23,636 మంది విద్యార్థులకు 23,120 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.82గా నమోదైందని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 50, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 5, తాను 6, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 9 మొత్తంగా 71 కేంద్రాలను తనిఖీ చేసినట్టు చెప్పారు.
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకూ పోరాడాలని ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు అన్నారు. ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికశాఖ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు డీసీఎల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేసే అధికారం మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనంతరం జేసీఎల్ ఎ.గణేష్‌కు వినతిపత్రం అందించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.గ్రీష్మకుమార్, ఎం.నాగరాజు, నగర ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


