ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంగారెడ్డిగూడెం బయల్దేరగా.. ఉండి బస్టాండ్ దాటి సెంటర్‌కు రాగానే ఆగిపోయింది. స్టీరింగ్ పట్టేయడంతో పాటు లోపలి నుంచి ఆయిల్ కారిపోవడంతో స్టీరింగ్ బిగిసిపోయింది. దీంతో మిట్టమధ్యాహ్నం ఉండి సెంటర్‌లో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సు డ్రైవర్ చాలా సేపు కష్టపడి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. చాలాసేపటి తరువాత ఉండి సెంటర్ నుండి ఆర్టీసి బస్సు బయల్దేరింది. అధికారులు బస్సుకు రిపేర్ చేయించకపోవడం.. బస్సు కండిషన్ చెక్ చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
గృహ వినియోగ గ్యాస్ సిలెండర్లు స్వాధీనం
ఏలూరు టౌన్: గృహాల్లో వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కే.నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్‌లో విజిలెన్స్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు నగరంలో కార్తికేయ సాయి హోటల్, డాల్ఫిన్ హోటల్, సాయిదుర్గ టిఫిన్స్, శ్రీలక్ష్మి గణపతి కేటరర్స్‌లో తనిఖీలు చేశారు. 18 గృహ అవసరాలకు వినియోగించే సిలెండర్లను గుర్తించారు. యజమానులపై నిత్యావసరాల చట్టం 1955 మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు.


