ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అక్షరాంధ్ర అభ్యాసకులు ఫైనల్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు. స్థానిక 23వ డివిజన్ ఫిరంగులదిబ్బ శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం అక్షరాంధ్ర పరీక్షలను ఆమె పరిశీలించారు. జిల్లాలోని 588 కేంద్రాల్లో 97,200 మంది అభ్యాసకులు పరీక్షలు రాస్తున్నారని, 2,117 మంది పరీక్షల నిర్వాహకులను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో నియమ, నిబంధనలు కచ్చితంగా పా టించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జీసీహెచ్ ప్రభాకర్, మెప్మా పీడీ ఎం.రాజబాబు, తహసీల్దార్ కె.గాయత్రీదేవి పాల్గొన్నారు.


