ఏలూరు టౌన్ : మోటార్‌సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను ఏలూరు టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు పవర్‌పేట డీఎన్‌టీ బాలుర వసతిగృహం సెల్లార్‌లో ఉన్న మోటారు సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 7న అపహరించుకుపోయారు. దీంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్, ఎస్సైలు కే.రామకృష్ణ, బీఎం వెంకట రాజా, ఏఎస్‌ఐ బీ.యేసు, హెచ్‌సీ కే.రవి ప్రత్యేక బృందంగా దర్యాప్తు చేపట్టారు. ఈనెల 11న ఏలూరు తంగెళ్ళమూడి సెంటర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుర వసతిగృహంలో చోరీతోపాటు, పలు దొంగతనం కేసుల్లోనూ ఆ ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన చిల్లా విజయ్‌కుమార్, ఏలూరు తాపీమేసీ్త్ర కాలనీ 5వ రోడ్ ప్రాంతానికి చెందిన బైక్, కారు మెకానిక్ తుతిక శ్రీనివాస్, కృష్ణాజిల్లా మచిలీపట్నం చింతగుంటపాలెం గ్రామానికి చెందిన బొమ్మసాని లక్ష్మీశ్రీనివాస్‌పై ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరినుంచి 7 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో ఒక మోటారు సైకిల్ చోరీ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం


