పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద అడబాల థియేటర్ పక్కన ఉన్న ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈనెల 13 శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’, ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘మంచి మనసులు’, 14న విజయవాడ సాంస్కృతిక సమితి, విజయవాడ వారి ‘మమ్మల్నీ బ్రతకనివ్వండి’, చైతన్య కళాభారతి, కరీంనగర్ వారి ‘ఖరీదైన జైళ్లు’, పరమాత్ముని క్రియేషన్స్ భాగ్యనగరం (హైదరాబాద్) వారి ‘ఎక్కడో ఏదో’, 15న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ‘సహన’, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’, శ్రీ హర్షా క్రియేషన్స్ విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ నాటికలు ప్రదర్శించనున్నారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎప్పుడో నిర్మించాలి
కళలకు నిలయమైన క్షీరపురిలో కళాపరిషత్‌కు వేదిక లేకుండా పోయింది. సుమారు పదేళ్లుగా పాలకొల్లు కళాపరిషత్ నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు నాటిక పోటీలంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా దాన్ని తొలగించడంతో నాటి నుంచి నేటి వరకూ నాటికల పోటీలు నిర్వహించడానికి సరైన వేదికే లేకుండా పోయింది. కొన్నాళ్లు అద్దేపల్లి వారి సత్రం ఖాళీ స్థలంలో నిర్వహించగా అక్కడ కాంప్లెక్స్ నిర్మించడంతో అవకాశం లేకుండా పోయింది. అనంతరం బస్టాండ్ వద్ద అడబాల థియేటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్నారు. వేదికతో సహా అన్ని ఏర్పాట్లు చేయాల్సి రావడంతో నిర్వహణ ఖర్చులు అధిక మవుతున్నాయని, త్వరగా ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని కళాకారులు కోరుతున్నారు.


