టి.నరసాపురం: బొర్రంపాలెం గ్రామం కరాటం కృష్ణమూర్తి జలాశయం వద్ద కట్టిన ఫ్లెక్సీని కాల్చి ధ్వంసం చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. జలాశయంలో కొందరు వ్యక్తులు అనధికారికంగా రొయ్యలు వేసి పట్టుకోవడంతో జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన జలాశయం లస్కర్ పాకనాటి లక్ష్మణరావు జలాశయం ఏఈ అనిల్ ఉత్తర్వులు మేరకు రొయ్యలు పట్టరాదని తెలియజేసే విధంగా అధికారికంగా కట్టారు. అయితే ఈ ఫ్లెక్సీని కొందరు కాల్చి ధ్వంసం చేశారు. దీనిపై లస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఉంగుటూరు: ఏలూరు గోదావరి కాలువలో నాచుగుంట వద్ద ఓ యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. అతడు తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లికి చెందిన గొంగడ లక్ష్మణ్‌గా గుర్తించారు. లక్ష్మన్ ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఈ క్రమంలో అతని మృతదేహం ఉంగుటూరు మండలం నాచుగుంట రేవు సమీపంలో తక్కుకు అడ్డుపడి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరుకు వీఆర్‌వో పెద్దిరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా మృతుడు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
పెనుగొండ: పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. 2021లో పెనుగొండ మండలం నడిపూడికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు పెళ్లికి ముఖం చాటేయడంతో గ్రామ పెద్దల సమక్షంలో విషయాన్ని పెట్టగా, ఇద్దరూ మేజర్ అయిన తర్వాత వివాహం జరిపిస్తామని నిందితుడు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. తరువాత నిందితుడు రహస్యంగా గల్ఫ్ దేశానికి పారిపోయాడు. బాధితురాలు మేజర్ అయిన తర్వాత వివాహం విషయం తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ జీవీ నాగేశ్వరరావు కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం మంగళవారం ముద్దాయి చిల్లే చరణ్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి, బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున వి.రమేష్‌నాయుడు వాదనలు వినిపించారు.
జీడిమామిడి తోట దగ్ధం
ద్వారకాతిరుమల: గుణ్ణంపల్లి రెవెన్యూ పరిధిలోని లక్ష్మీనగర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం ఒక జీడిమామిడి తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు బ్రహ్మమ్మ, ఎర్రయ్య దంపతులకు అదే గ్రామంలో ఒక ఎకరం జీడిమామిడి తోట ఉంది. అయితే తోట పైనుంచి వెళ్లిన విద్యుత్ మెయిన్‌లైన్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో, తోటకు నిప్పంటుకుందని బాధితురాలు బ్రహ్మమ్మ తెలిపారు. మంటలు వేగంగా విస్తరించడంతో తోట మొత్తం దగ్ధమైందన్నారు. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు చెప్పారు. చేతికందొచ్చిన పంట బుగ్గిపాలు కావడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అయ్యింది.
నూజివీడు: నాణ్యమైన మామిడి పండిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇతర రాష్ట్రాల్లోని మామిడి కొనుగోలుదారులను ఇక్కడకు రప్పించి మంచి ధర వచ్చేలా చూస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి అమ్మకందారులు, కొనుగోలుదారుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ రైతులు ఉద్యాన అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి నాణ్యత కలిగిన మామిడి కాయలను ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నూజివీడు ఉద్యాన అధికారి హేమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏలూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ రామ్మోహనరావు, నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బీ కనకమహాలక్ష్మి జిల్లా ఉద్యాన శాఖ అధికారి షాజ నాయక్ , రైతు సేవా కేంద్రాల సిబ్బంది, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల వర్క్‌షాప్ మంగళవారంతో ముగిసింది. ఈ జాతీయ వర్క్‌షాప్‌లో మొత్తం 414 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యక్షంగా ఈ వర్క్ షాప్‌లో పాల్గొనగా పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్‌లైన్ ద్వారా వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. రెండోరోజు వర్క్‌షాపులో తాడేపల్లిగూడెం నిట్ కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు గరిమెళ్ల సాయి మణికిరణ్ పాల్గొని ‘ఫ్లూయిడ్ ఫ్లో రిలేటెడ్ ప్రాబ్లంస్ ఆన్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్’ అనే అంశంపై ప్రసంగించారు. కెమికల్ బ్రాంచి విభాగాధిపతి, వర్క్‌షాప్ కన్వీనర్ మైథిలి, జాయింట్ కన్వీనర్ రామకృష్ణ, కెమికల్ విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త డయాఫ్రం వాల్ 1372 మీటర్లకు గాను 1300 మీటర్లు నేటికి పూర్తయిందని చెప్పారు. ఈ నెలాఖరుకు మొత్తం పూర్తవుతుందన్నారు. కుడి, ఎడమ కాలువలను ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు. జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
కై కలూరు: యూత్ నేషనల్ వాలీబాల్ రిఫరీగా కై కలూరు మండలం రెడ్డినగర్‌కు చెందిన డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రామానంద్ చౌదరీ నుంచి నియామక ఉత్తర్వులు అందాయి. ఒడిశా రాష్ట్ర భువనేశ్వర్ కలింగ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీరియల్ టెక్నాలజీ(కిట్స్)లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 26వ యూత్ నేషనల్ బాలుర, బాలికల వాలీబాల్ చాంపియన్‌షిప్ జరగనుంది. శ్రీనివాసరెడ్డి తెలంగాణలో కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీనివాసరరెడ్డికి మాత్రమే రిఫరీగా అవకాశం దక్కడంపై కై కలూరులో పలువురు అభినందనలు తెలిపారు.


