నిలకడ లేని కోకో ధర | - | Sakshi
Sakshi News home page

నిలకడ లేని కోకో ధర

Mar 11 2026 7:51 AM | Updated on Mar 11 2026 7:51 AM

కిలో రూ.500కు కొనుగోలు చేయాలి భారంగా కోకో సాగు అంతర్జాతీయ ధర చెల్లించాలి ●

గతేడాది రూ.700 పలికిన ధర

నేడు రూ.330 నుంచి రూ.350 వరకు పతనం

ధర పతనంతో రైతులు సతమతం

తాడేపల్లిగూడెం రూరల్‌: వాణిజ్య పంటగా ఉన్న కోకో సాగు చేసిన రైతుకు కడగండ్లు తప్పడం లేదు. ఏడాది పొడవునా పంట పండించే అవకాశం ఉండటం, ధర స్థిరంగా లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే 4,219 ఎకరాల్లో కోకో పంట పండిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎకరం పంటకు సాగు చేస్తే ఏడాదికి రూ.50వేలు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి మూడు క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ మధ్యలో అత్యధిక పంట వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కోకో గింజలు కిలోకు 2024 జనవరిలో 800 నుంచి రూ.వెయ్యి ధర లభించింది. 2025 జనవరిలో రూ.700, అదే ఏడాది మార్చిలో రూ.600 వరకు ధర పలికింది. ప్రస్తుతం కిలో రూ.330 నుంచి రూ.350 మాత్రమే ధర లభిస్తుందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది మార్చితో పోల్చుకుంటే కిలోకు రూ.250 తగ్గిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేను మూడెకరాల్లో కోకో పంట సాగు చేశాను. ప్రస్తుతం పంట చేతికొస్తుంది. మార్కెట్‌లో కోకో గింజలు కిలోకు రూ.300 నుంచి రూ.350కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు, ప్రస్తుతం ఉన్న ధరకు ఏ మాత్రం పొంతన లేదు. కంపెనీలు కిలోకు రూ.500 చెల్లిస్తే గిట్టుబాటు అవుతుంది.

– మేకా రామారావు, కోకో రైతు, కృష్ణాపురం, తాడేపల్లిగూడెం మండలం

కొబ్బరిలో అంతర పంటగా కోకో పంటను పదెకరాల్లో సాగు చేశాను. పంట చేతికొచ్చినా ధర మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, పురుగు మందుల పెట్టుబడులతో పాటు కూలీ ఖర్చులు వెరసి సాగు భారంగా మారుతోంది. కంపెనీలు రైతును దృష్టిలో ఉంచుకుని ధర పెంచాలి.

– యలమాటి విశ్వేశ్వరరావు, కోకో రైతు, నీలాద్రిపురం, తాడేపల్లిగూడెం మండలం

కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర చెల్లించాలి. కోకో గింజలకు అంతర్జాతీయంగా ధర ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఇక్కడి రైతులకు సరైన ధర లభించడం లేదు. తగ్గినప్పుడు మాత్రం ధర తగ్గించడం ఎంత వరకు సమంజసం. కిలో గింజలకు రూ.500 చెల్లించాలి.

– బోళ్ళ వెంకటసుబ్బారావు (సబ్బి),

కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement