‘పాలిటెక్నిక్‌’ని పట్టించుకునేవారేరీ? | - | Sakshi
Sakshi News home page

‘పాలిటెక్నిక్‌’ని పట్టించుకునేవారేరీ?

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

‘పాలిటెక్నిక్‌’ని పట్టించుకునేవారేరీ? ఇంత నిర్లక్ష్యం తగదు అన్ని కోర్సులూ చేపట్టేలా చర్యలు

పాలిటెక్నిక్‌తో ప్రయోజనం

నిరుపయోగంగా బోధన సామగ్రి

కళాశాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం

గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ కళాశాల నామమాత్రంగా ఉన్నప్పటికీ కనీసం ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. గిరిజన విద్యార్థులు ఎంతగానో ఉపయోగపడే ఈ కళాశాల నిర్వహణను సక్రమంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలి. పాలిటెక్నిక్‌ విద్యను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి.

– బన్నే వినోద్‌, పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు, బుట్టాయగూడెం

పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణను మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు కళాశాలలో చేరేలా చూస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటించి కళాశాలలో చేరే విధంగా చూస్తున్నాం. అధ్యాపకుల ఖాళీ పోస్టులు భర్తీ కాగానే నిర్వహణ చేపడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు మాకు సహకరించాలి.

– చంద్రశేఖర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ఓఎస్‌డీ– కేఆర్‌పురం

బుట్టాయగూడెం: గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలనే ఉద్దేశంతో బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ సమీపంలో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ కళాశాల ఉన్నట్టా? లేనట్టా? అనే చందంగా ఉంది. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్య, ఉద్యోగ అవకాశాలను స్వయం ఉపాధి చేపట్టేందుకు పాలిటెక్నిక్‌ విద్య ఉత్తమ మార్గమని 2015లో పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల నిర్వహణ రెండేళ్ల పాటు విజయవాడలో నిర్వహించారు. గిరిజన విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ గురుకుల పాలిటెక్నిక్‌ కళాశాలగా పేరు మార్చి విజయవాడ నుంచి బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ సమీపంలోనే ఒక భవనంలో పాలిటెక్నిక్‌ కళాశాలను మార్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. 2020 వరకూ ఈ కశాళాలలో కోర్సులు బాగానే నిర్వహించినా తర్వాత కరోనా కారణంగా కళాశాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కరోనా తర్వాత ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు రాకపోవడం, విద్యార్థులను చేర్పించేందుకు సంబంధింత అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పడు విద్యార్థులే లేని కళాశాలగా ఉంది.

నిరుపయోగంగా బోధన సామగ్రి

పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బోధనా సామగ్రి నేడు నిరుపయోగంగా ఉంది. ఈ కళాశాలను సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులతో గిరిజన ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో సహ అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఉద్యోగ పోస్టులు భర్తీ కాకపోవడంతో బయట కళాశాల నుంచి డిప్యుటేషన్‌పై ఆయా పోస్టులకు సంబంధించిన వారిని నియమించారు. రాజమండ్రి పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. అయన ఇక్కడ పని చేస్తున్న సమయంలో అప్పట్లో రూ. 10 లక్షలతో ఫిజిక్స్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్లు, మూడు డిజిటల్‌ తరగతి విభాగాలను ఏర్పాటు చేసి బోధనా సామగ్రిని ఏర్పాటు చేశారు. ఈ కళాశాల సొంత భవనం ఏర్పాటు చేసేందుకు భూసేకరణ ప్రక్రియ కూడా చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకానికి ప్రయత్నాలు చేశారు. కరోనా తర్వాత పోస్టుల భర్తీతోపాటు భూసేకరణ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ల్యాబ్‌లు, సామగ్రి నిరుపయోగంగా మారాయి. అధ్యాపకులు లేకపోవడంతో కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు.

ఇటీవల ఇద్దరు అధ్యాపకుల నియామకం

కేఆర్‌పురం ఐటీడీఏ సమీపంలో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇద్దరు అధ్యాపకులను నియమించినట్లు ప్రస్తుతం కళాశాల ఓఎస్‌డీగా పనిచేస్తున్న సీనియర్‌ అధ్యాపకులు చంద్రశేఖర్‌ తెలిపారు. తాత్కాలిక పద్ధతిన వాచ్‌మెన్‌ కూడా ఈ కళాశాలలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తాను ఐటీడీఏ పరిధిలో ఉన్న 18 పాఠశాలల నుంచి విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో విద్య, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి పాలిటెక్నిక్‌ విద్యతోనే అందుతాయి. ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థుల కంటే పాలిటెక్నిక్‌ ద్వారా ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థుల్లో థియరీ, ప్రాక్టికల్స్‌ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి విద్య గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ కళాశాల నిర్వహణ సక్రమంగా నిర్వహించడంతో అధికారులు విఫలమవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నామమాత్రంగా నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించేలా ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement