పొగాకు సాగులో బిందు సేద్యం | - | Sakshi
Sakshi News home page

పొగాకు సాగులో బిందు సేద్యం

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

పొగాకు సాగులో బిందు సేద్యం కాకినాడ సమావేశాన్ని జయప్రదం చేయాలి ఏటీఎం కార్డు మార్చి మోసం గ్రాఫ్టింగ్‌ పద్ధతిలో అధిక దిగుబడులు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

బుట్టాయగూడెం: పొగాకు సాగులో యాంత్రీకరణ అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ రకాల టెక్నాలజీల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రాజశేఖర్‌, జీలుగుమిల్లి పరిశోధనా కేంద్రం హెడ్‌ డాక్టర్‌ వైవీ సుబ్బయ్య అన్నారు. జాతీయ వాణిజ్య పంటల పరిశోధన కేంద్రం జీలుగుమిల్లిలో సుస్థిర వ్యవసాయం ద్వారా రైతులను శక్తివంతంగా చేయడంపై సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్జీనియా పొగాకు సాగులో సెన్సార్‌ ఆధారిత బిందుసేద్యం వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల సామర్థ్యం, నిర్మాణం అంశాలపై ఐసీఏఆర్‌ ఎన్‌ఐఆర్‌సీఏ డైరెక్టర్‌ డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌ ఆదేశాల మేరకు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సెన్సార్‌ ఆధారిత డ్రిప్‌ ఇరిగేషన్‌, డ్రోన్‌ స్ప్రేయింగ్‌ పద్దతులపై కూడా రైతులకు అవగాహన కలిగించినట్లు చెప్పారు.

ముసునూరు: ఈ నెల 11న కాకినాడలో జరుగనున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ స్టేట్‌ ఎస్సీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ కంబాల రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను కాకినాడ సమావేశంలో సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై నేడు జరుగుతున్న కక్ష పూరిత పాలనకు చరమగీతం పాడేందుకు సమావేశం వేదిక కానుందని తెలిపారు.

తణుకు అర్బన్‌: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు తీసి ఇమ్మన్న వ్యక్తి కార్డు నుంచి నగదు కాజేసిన ఘటన తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులో ఉంటున్న బచ్చు సుబ్బారావు సోమవారం ఉదయం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న వ్యక్తిని తన కార్డుపై డబ్బులు తీసి పెట్టమని అడిగి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్‌ నంబరు చెప్పారు. ఆ అగంతకుడు రెండుసార్లు కార్డును మిషన్‌లో పెట్టి తీసి కార్డు పనిచేయడంలేదని కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. సుబ్బారావు ఇంటికి వెళ్లి బ్యాంక్‌ పాస్‌ బుక్‌ తీసుకుని బ్యాంక్‌కు వెళ్లి ఆరాతీయగా.. తన అకౌంట్‌ నుంచి మూడు దఫాలుగా రూ.23,430 డ్రా చేశారని ఇంకా రూ.35 మాత్రమే ఉన్నాయని చెప్పడంతో బాధితుడు ఆందోళన చెందారు. తన ఏటీఎం కార్డు చూపించగా అది మీ కార్డు కాదని చెప్పడంతో అప్పుడు అసలు మోసం తెలిసింది. డబ్బులు రాలేదని కార్డు తిరిగి ఇచ్చే క్రమంలో అగంతకుడు కార్డును మార్చి వేరు కార్డు ఇచ్చాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాడేపల్లిగూడెం: గ్రాఫ్టింగ్‌ పద్ధతిలో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏపీ నిట్‌లో సోమవారం బృందావనం క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన హైడ్రోగ్రాఫ్ట్‌పై అవగాహన కల్పించారు. నాణ్యమైన మొక్కల కోసం అంటుకట్టే పద్ధతులు మేలని నర్సరీ నిర్వాహకులు బ్రహ్మాజీ తెలిపారు. మొక్కలను పెంచే హైడ్రోఫోనిక్స్‌ పద్ధతి గురించి తెలియచేశారు.

జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందినట్లు హెచ్‌సీ ఎన్‌.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఎస్‌కే ఖాలీసా (55) బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో పొగాకు గొట్టాల వ్యాపారం చేసేవాడు. ఫిబ్రవరి 22న దర్భగూడెంలో జరిగిన తిరునాళ్ళకు వెళ్ళాడు. తిరిగి రెడ్డిగణపవరం వెళుతుండగా, తాడువాయి సమీపంలో మోటార్‌సైకిల్‌ స్కిడ్‌ అయ్యి పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అక్కడ మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement