రూ.45 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
ఏలూరు టౌన్ : తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలు ఏడాది కాలంగా రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి వస్తువులు, విలువైన సామగ్రి, నగదును చోరీ చేస్తోన్న ఇద్దరు దొంగలను కై కలూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. సుమారు రూ.45 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, కృష్ణా జిల్లా పెడన, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మరికొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు గత ఏడాది కాలంగా నేరాలకు అలవాటుపడి, వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కలిదిండి మండలం గురవాయిపాలెం గ్రామానికి చెందిన గొల్ల వంశీ, ప్రస్తుతం కలిదిండి శివారు మిలటరీపేటలో ఉంటోన్న భాస్కరరావుపేటకు చెందిన కాల దేవీవరప్రసాద్‌ను సోమవారం ముదినేపల్లిలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆస్తి సంబంధిత 7 కేసుల్లో భారీ ఎత్తున సుమారు 45 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగల నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో 3 కిలోల వెండి వస్తువులు, మూడు ఎల్‌ఈడీ టీవీలు, మూడు గ్యాస్ సిలిండర్లు, మూడు మోటారు సైకిళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులను ఛేదించటంలో ప్రతిభ చూపిన కై కలూరు రూరల్ సీఐ రవికుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వీఎస్‌వీ భద్రరావు, కలిదిండి ఎస్‌ఐ వీ.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ బీ.నాగబాబు, పీ.నాగరాజు, పీ.పవన్‌కుమార్, హోంగార్డు జీ.శివకోటయ్య, ఏలూరు డీఎస్‌బీ సెల్‌ట్రాక్ హెచ్‌సీ పీవీ సత్యనారాయణను ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.


