ఏలూరు టౌన్ : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన ఒక మహిళ సైబర్ నేరగాళ్ళు ఉచ్చులో పడి పోగొట్టుకున్న రూ.4.50 లక్షల నగదును బాధితురాలికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతులమీదుగా అందజేశారు. కై కలూరు టౌన్ ఎన్‌జీవో కాలనీకి చెందిన పెనుమాల ప్రసన్నను వాట్సప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సంప్రదించారు. ఇండియా నివేష్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ పేరుతో కంపెనీ ప్రతినిధులమంటూ నమ్మించారు. నివ్ ప్రో నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయంటూ ఆశచూపారు. సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మిన బాధిత మహిళ 2025 నవంబర్ 5 నుంచి 2025 డిసెంబర్ 4 వరకూ దఫదఫాలుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. సైబర్ సెల్ సీఐ దాసు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నగదును ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించి గతంలోనే రూ.లక్ష నగదును ఆన్‌లైన్‌లో రిఫండ్ చేయించారు. లోతైన దర్యాప్తు చేస్తూ తమిళనాడు వేలూరు ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఖాతాకు డబ్బులు వెళ్ళినట్లు గుర్తించారు. పోలీస్ అధికారులు తమిళనాడు వేలూరు ప్రాంతానికి వెళ్ళి సొమ్మును రికవరీ చేశారు. సోమవారం రూ.4.50 లక్షల నగదును బాధితురాలి చేతికి ఎస్పీ శివకిషోర్ చేతులమీదుగా అందజేశారు. మొత్తం రూ.5.50 లక్షల సొమ్మును రికవరీ చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లే స్టోర్‌లో లేని అనధికార ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. సైబర్ మోసాల బారిన పడిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.


