ద్వారకాతిరుమల: మండలంలోని రామసింగవరంలో ఓ టీడీపీ కార్యకర్త భార్య సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాలసాని సత్యన్నారాయణకు, తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన గెడ నాగదుర్గ(23)కి 2020లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. ఇంటికి మంచి నీటి కుళాయి లేకపోవడంతో నాగదుర్గ కుళాయి వేయించమని భర్తతో పలుమార్లు చెప్పింది. ఈ విషయంపై తరచు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దాంతో మృతురాలి తండ్రి దండిరాజు, ఆమె సోదరుడు ఆదివారం రామసింగవరంకు వచ్చి, సర్ధిచెప్పారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి కనకమహాలక్ష్మి ఫోన్ చేయగా, నాగదుర్గ ఇంకా నిద్ర లేవలేదని చెప్పారు. ఉదయం నీటి కుళాయి విషయంలో మళ్లీ భార్య, భర్తలకు మద్య గొడవ జరగ్గా, నాగదుర్గ మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్టు ఆమె తల్లి కనక మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నూజివీడు: పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్ధి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లికి చెందిన విద్యార్ధి స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. గత నెల 23న హాస్టల్ నుంచి హైస్కూల్‌కు వెళ్లిన విద్యార్థి సాయంత్రం 4 గంటలకు హైస్కూల్ వదిలిన తరువాత తిరిగి హాస్టల్‌కు రాలేదు. దీంతో అదేరోజు సాయంత్రం 6 గంటల తరువాత గమనించి అతని తల్లికి ఫోన్ చేశారు. పట్టణంలోని అజరయ్యపేటలోని అక్క ఇంటికి వెళ్లాడని, రేపు తీసుకువస్తామని వార్డెన్‌కు బాలుడి తల్లి సమాధానం చెప్పింది. 24న హైస్కూల్‌కు వచ్చిన విద్యార్ధి మధ్యాహ్నం వరకు ఉండి పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తిని పుస్తకాల బ్యాగ్ స్కూల్‌లోనే వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రానికి విద్యార్థి రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ మరల బాలుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. స్థానికంగాను, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనబడకపోవడంతో ఈ నెల 1న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వార్డెన్ ఫిర్యాదు చేశారు.


