నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్–ఓపెన్‌ఫోమ్ సాఫ్ట్‌వేర్ వినియోగం’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్(ఐఐసీహెచ్‌ఈ) అమరావతి రీజినల్ సెంటర్, ఐఐసీహెచ్‌ఈ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనిలో పాల్గొన్న ఐఐటీ తిరుపతి మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు శ్రీనివాస కృష్ణ అద్దేపల్లి మాట్లాడుతూ ఓపెన్ ఫోమ్ ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని అన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా సంక్లిష్టమైన భౌతిక సమస్యలను తక్కువ ఖర్చుతో అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఐఐసీహెచ్‌ఈ అమరావతి రీజినల్ సెంటర్ చైర్మన్ వీ గోవర్ధనరావు అధ్యక్షత వహించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, ఏఓ బీ.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాధు చిరంజీవి, ఫైనాన్స్ ఆఫీసర్ బీ శ్రీనాథ్ పాల్గొన్నారు.


