ప్రత్యేక రుచి
రంజాన్ నెలలో స్పెషల్
● రంజాన్ మాసంలో ప్రత్యేక పానీయం
● తక్షణ శక్తినిచ్చే దివ్య ఔషధం
చింతలపూడి: రంజాన్ మాసం అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది హలీం. అయితే మన ప్రాంతంలోని ముస్లింలకు మాత్రం వెంటనే హరీరా గుర్తుకు వస్తుంది. రంజాన్ మాసంలో ముస్లింలు పగటి సమయమంతా అన్నపానీయాలు, ఆహార పదార్థాలుతీసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తారు. సాయంత్రం ఇఫ్తార్ ప్రార్థనల అనంతరం దీక్ష విరమిస్తారు. నిర్ణీత వేళల్లో పండ్లు, పలహారాలతో దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడిగా కూర్చుని ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్‌లో మన జిల్లావాసులకు పోషకాహారంతో హరీరా తప్పనిసరి. చింతలపూడి మసీదులో 62 ఏళ్ల క్రితం రోజుకు 3 రూపాయలతో అప్పటి జమాతె ఇస్లామి హింద్ నాయకులు బషార్‌తుల్లా హరీరా తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు రూ.5 వేల ఖర్చుతో హరీరాను తయారు చేస్తున్నారు. దూరప్రాంతాల నుండి కూడ వచ్చి ఇక్కడ హరీరా సేవిస్తారు.
పోషకాలకు నెలవు
ఉపవాస దీక్ష విరమణలో వినియోగించే హరీరా (గంజి)కి ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉంది. గత 67 ఏళ్లుగా చింతలపూడి హరీరాకు ప్రత్యేకత స్ధానం ఉంది. శ్రీహరీరాశ్రీ. కేవలం ఒక పానీయంగానే కాకుండా, రోజంతా అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తినిచ్చే దివ్య ఔషధంగా దీనిని పరిగణిస్తారు. హరీరాను సాధారణ భాషలో దీనిని శ్రీగంజిశ్రీ అని పిలిచినప్పటికీ ఇది పోషకాలతో నిండిన ఒక ప్రత్యేక మిశ్రమం. రోజంతా ఉపవాసం ఉన్న వాళ్లు ఈ హరీరా తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఈ హరీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇందులో ఉపయోగించే మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తాయి. హరీరా తయారు చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేయడంతో దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
హలీంకు తీసిపోని వంటకం
హరీరా తయారీలో సుమారు 20 రకాల బియ్యం రవ్వ, మటన్ ఖైమా, వేరుశనగ నూనె, డాల్డా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పొదీన, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క, పెసరపప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల వస్తువులతో హరీరా తయారు చేస్తారు. అనేక రకాల సుగంధ ద్రవ్యాలను వేసి తయారు చేయడం వల్ల ఇది హైదరాబాద్ హలీంకు ఏ మాత్రం తీసి పోకుండ రుచికరంగా ఉంటుంది.
చింతలపూడి హరీరాకు ప్రత్యేక రుచి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంత ముస్లింలకు రంజాన్ నెల వచ్చిందంటే హరీరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా హరీరా మంచి ఆహారం. ఉపవాసదీక్షలో తప్పనిసరిగా ముస్లింలు హరీరా సేవించి దీక్షను విరమిస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాక పగలంతా ఉపవాసాలు ఉన్న వారికి తక్షణ శక్తిని ఇస్తుంది.
– ఎండీ ఇస్మాయిల్, జామియ మసీద్, చింతలపూడి
ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 30 రోజులపాటు ఉపవాసాలు ఉండి హరీరా సేవించడం ఆరోగ్యానికి మంచిది. రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా సేవించకుండా ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు భగవంతుని కృప కోసం ఇఫ్తార్ సమయంలో హరీరా (గంజి )సేవిస్తారు. తక్షణ శక్తినిచ్చే హరీరాను అందరూ ఇష్టంగా సేవిస్తారు.
ఎండీ అక్బర్ అలీ, జామియ మసీద్ కమిటీ కార్యదర్శి


