జంగారెడ్డిగూడెం: రూ. 2.99 కోట్ల విలువైన 598 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ వజ్రప్రహార్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం – అశ్వారావుపేట జాతీయ రహదారి ఎన్‌హెచ్ 516డీపై జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం సమీపంలోని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ బోర్డర్ చెక్‌పోస్టు వద్ద జీలుగుమిల్లి ఎస్సై వి.క్రాంతి కుమార్, సిబ్బందినిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ తనిఖీల్లో అశ్వారావుపేట వైపు వెళుతున్న టాటా డీజీఎం వ్యాన్‌లో 598 కిలోల గంజాయిని గుర్తించి, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిందితులు ఒరిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా బీజ్‌పూర్ గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ మొహంతి, బ్రహ్మపూర్ గ్రామానికి చెందిన జనార్ధన్ ప్రాదాన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా, సదరు గంజాయిని రాజమండ్రి శివారులోని బూరుగుపూడి నుంచి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారన్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్–1985 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి రూ. 2,98,96,500 విలువైన 598 కేజీల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన రూ.16లక్షలు విలువైన టాటా డీసీఎం వ్యాన్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం స్వాధీన సొత్తు విలువ సుమారు రూ. 3,14,96,500 ఉంటుందని స్పష్టం చేశారు. జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన జీలుగుమిల్లి ఎస్సై కె.క్రాంతికుమార్, హెచ్‌సీ కె.నాగేశ్వరరావు, కానిస్టేబుళ్ళు పి.శ్రీరామ్, మణికంఠ, డి.లక్ష్మణరావు, ఎం.రవికుమార్, బి.మహేష్‌బాబు, టి.శ్రీనివాసరెడ్డి, ఎం.సురేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ తదితరులు పాల్గొన్నారు.


