దొరకునా ఇటువంటి సేవ..
నేతకు ముందు దీక్ష చేపట్టి
శివయ్య కల్పించిన అదృష్టం
● క్షీరారామలింగేశ్వరస్వామికి 47 ఏళ్లుగా పాగా నేస్తున్న వీరన్న కుటుంబం
● పూర్వీకుల ఆనవాయితీ నిలబెడుతున్న సోమేశ్వరరావు
పాలకొల్లు సెంట్రల్: మహాశివరాత్రి ఉత్సవాలు మరో ఇరవై రోజుల్లో ప్రారంభంకానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా ఏర్పాటుచేస్తారు. అటు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో తదుపరి పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామివార్లకు మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ సమయంలో మల్లన్న పాగాను సమర్పిస్తారు. లింగోద్భవ సమయానికి స్వామివారి గర్భాలయం శిఖరం నుంచి గాలిగోపురం శిఖరం వరకూ రెండు పేటలుగా అమరుస్తారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు అర్థరాత్రి సమయంలో తండోపతండాలుగా తరలివస్తుంటారు.
1979లో ప్రారంభం
స్వామివారికి సమర్పించే ఈ పాగాను పాలకొల్లు మండలంలోని దగ్గులూరు గ్రామానికి చెందిన అందే వీరన్న 1979లో ప్రారంభించారు. శ్రీశైలంలో ఏర్పాటుచేసే పాగాను చూసిన వీరన్న నాడు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదించి ఆలయ అధికారుల అనుమతితో నాడు మల్లన్న పాగాను స్వయంగా మగ్గంపై నేచి స్వామివారికి సమర్పించేవారు. అనంతరం వీరన్న అల్లుడుకు వారసికంగా ఈ పాగాను నేయడం అందించారు. నేడు వారి మనవడు వరదా సోమేశ్వరరావు తన తాతగారి వారసికాన్ని నిలబెడుతున్నారు. ఖర్చుతో కూడుకున్నా, పనిభారమైనా.. స్వామివారు కల్పించిన అదృష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు.
కార్తీకమాసంలో పాగా నేతకు ఏర్పాట్లు
కార్తీకమాసం ప్రారంభంలో పాగా నేతకు పనులు ప్రారంభిస్తారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పాగా పనులు ప్రారంభిస్తారు. కృష్ణాజిల్లా పెడన వెళ్లి నూలు (దారం) తెచ్చుకుని ఆ నూలును తడిపి ఐదు రోజులు పాటు నానబెడతారు. ఆరవ రోజు ఆ నూలుకు గెంజి పెట్టి ఎండలో ఆరబెడతారు. అనంతరం రాట్నంతో నూలు తోడుకుంటారు. నూలు తోడుకున్న డబ్బాలతో తూర్పుగోదావరి జిల్లా బండారులంక తీసుకువెళ్లి అక్కడ ఈ నూలును రోలింగ్ (దంత్రం) చేయిస్తారు. 200 గజాల పొడుగు వచ్చేలా రోలింగ్ చేస్తారు. అక్కడ నుంచి ఆ రోలింగ్‌ను నరసాపురం తీసుకువస్తారు. ఇక్కడ సుమారు 26 మంది భక్తి శ్రద్ధలతో రోలింగ్‌కు గెంజి పెట్టి పడుగు ఏర్పాటుచేస్తారు. అనంతరం దానిని చుట్టుకుని ఇంటికి తెచ్చి అల్లుసాపుకుని అంతరం బొండకు చుడతారు. ఈ సమయంలో సుమారు చుట్టుపక్కల ఓ పది, పదిహేను మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొంటారు. ఆ బొండను మగ్గం ఎక్కిస్తారు.
మహాశివరాత్రికి ముందుగా రెండు లేక మూడు నెలలు ముందు ఇంటిలో స్వామివారి పీఠం ఏర్పాటుచేసుకుని ఆ బొండను మగ్గం ఎక్కించి అప్పటి నుంచి పాగాను నేయడం మొదలు పెడతారు. ప్రతి రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టి మగ్గం నేయడం ప్రారంభించి ఉదయం రెండు గంటలు, రాత్రి ఓ ఆరు గంటలు పాటు నేస్తుంటారు. రాత్రి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నేతను ముగిస్తారు. ఇలా రోజుకు దాదాపు నాలుగు లేదా ఐదు మూరలు నేస్తుంటారు. మిగిలిన సమయంలో వాళ్ల వృత్తి ప్రకారం నేత చీరలు నేస్తుంటారు. ఈ పాగాను 180 మీటర్లు పొడవు, 90 సెం.మీ వెడల్పుతో ఏర్పాటుచేస్తారు. స్వామివారికి రోజుకు ఓ మూర చొప్పున లెక్కించి 365 మూరలు వచ్చేలా పాగా తయారు చేస్తారు. అలాగే మరో 20 మూరలు పార్వతి అమ్మవారికి సమర్పిస్తారు. పాగా నేస్తున్న అన్ని రోజులు ఎక్కడకు పలకరింపులకు వెళ్లరు, మాంసాహారం ముట్టుకోకుండా దీక్షతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటారు. అలాగే ఈ మగ్గాన్ని ఒక్క స్వామివారి పాగా నేయడం కొరకే ఉపయోగిస్తుంటారు.
పంచారామాల్లో ఎక్కడా లేని ఈ పాగా నేత మాకు క్షీరారామలింగేశ్వరస్వామి కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం. మా తాతగారు మాకు అప్పగించిన వారసికాన్ని నిలబెట్టుకుంటున్నాము. ప్రస్తుతం పాగా తయారీ ఖర్చుతోపాటు, సహకరించే మనుషులు పెద్దగా దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ అధికారులు ఆర్థికంగా కొంతవరకూ సహాయం చేస్తుంటారు.
– వరదా సోమేశ్వరరావు, రామకోటి దంపతులు, దగ్గులూరు
దొరకునా ఇటువంటి సేవ..


