పులి దాడులు.. ఏజెన్సీ బెంబేలు
● ఆవులపై దాడి చేసి హతమార్చిన వైనం
● భయాందోళనలో ప్రజలు
● అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ ఆవులపై దాడి చేస్తున్న సంఘటనతో కలకలం రేగింది. బుధ వారం బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బల మంగమ్మతల్లి గుడికి వెళ్లే మార్గంలో పులి కనిపించగా అధికారులు పాదముద్రలను గుర్తించారు. అలాగే అంతర్వేదిగూడెం సమీపంలో గోపాలరాజు అనే రైతుపై దాడికి యత్నించగా ఆయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాడు. గురువారం నాగులవారిగూడెం సమీపంలో కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మకు చెందిన కట్టేసి ఉన్న మూడు ఆవులపై పెద్ద పులి దాడి చేసి చంపివేసింది. వీటిలో ఒక ఆవు సూడిది. కాగా రాత్రికి ఇదే ప్రాంతానికి మరలా పెద్ద పులి వచ్చి మరో రెండు ఆవులపై దాడి చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిపుణులతో పా టు క్లూస్ టీమ్, వైల్డ్‌లైఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆవులపై దాడి చేసిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు.
అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు (టూటౌన్)/జంగారెడ్డిగూడెం: జిల్లాలో పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తెలిసినా అధికారులకు తెలియజేయా లని జిల్లా అటవీశాఖ అధికా రి సందీప్‌రెడ్డి తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా కార్యాలయం, జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కావడిగుండ్లలో, గురువారం అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లో పులి సంచరించిందన్నారు. ములగలంపల్లి సెక్షన్, ములగలంపల్లి బీట్ బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్‌లో తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. ఇదే పులి తెలంగాణలోని కావిడగుండ్ల అటవీ ప్రాంతం నుంచి అంతర్వేదిగూడెం బీట్ పరిధిలోని నాగవరం ముఠా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్టుమెంట్ నం.128 నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్టు గుర్తించామన్నారు. బెడదనూరు, పాకలగూడెం, అంకన్నగూడెం మొదలగు రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువుల పాకల వద్ద వెలుతురు వచ్చేలా దీపాలు ఏర్పాటుచేయాలన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారన్నారు. సామాజిక మాధ్యమాల్లో పులి సంచారంపై అవాస్తవాలు వస్తే నమ్మవద్దన్నారు. తమ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పులి కదలికలను గమనిస్తున్నారు. ఎన్‌టీపీఏ (న్యూఢిల్లీ) సూచనల మేరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
జిల్లాలో అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. సబ్ డివిజనల్ అటవీ అధికారి, జంగారెడ్డిగూడెం, సెల్ 95054 99141, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంగారెడ్డిగూడెం, సెల్ 94408 10223, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ములగలంపల్లి సెల్: 95509 02333, కంట్రోల్ రూమ్ ఏలూరు, సెల్ 9908880327లకు పులికి సంబంధించిన సమాచారం అందించాలని కోరారు.
బుట్టాయగూడెం మండలం నాగులగూడెం సమీపంలో మృతి చెందిన ఆవును పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు, ట్రాప్ కెమెరాను అమరుస్తున్న దృశ్యం
పులి దాడులు.. ఏజెన్సీ బెంబేలు
పులి దాడులు.. ఏజెన్సీ బెంబేలు


