కాలువలో గుర్రపు డెక్క తొలగింపు
ఎఫెక్ట్
భీమడోలు: గోదావరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, కర్ర నాచు తొలగింపు పనులను సాగునీటి సంఘాలు, ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలయ్యే అవకాశాలున్నందున ఇప్పటికే సాగునీరు అందక వరి నాట్లు పూర్తి కాని స్థితిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 3వ తేదీన దాళ్వాకు సాగు నీరందేనా? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. రెండు రోజులుగా సాగునీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు చెత్తాచెదారం తొలగింపు పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గోదావరి కాలువ శివారు గుండుగొలను నుంచి దిగువ ప్రాంతాల్లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపుడెక్క, కర్రనాచులను పంటుపై ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసి వాటిని తొలగించే పనులు చేస్తున్నారు. దెందులూరు మండల పరిధిలోని పాలగూడెం ఏరియాలో 600 ఎకరాల్లో నీరందక నేటికీ దాళ్వా వరి నాట్లు వేయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి నీరందించేందుకు గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
కాలువలో గుర్రపు డెక్క తొలగింపు


