వచ్చే పుష్కరాలకు ముందే ‘పోలవరం’ ప్రారంభం
ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను, పురోగతిని ఆయన గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ప్రాజెక్టు పరిధిలోని గ్యాప్–1లో ప్రధాన డ్యామ్ రాక్ ఫిల్లింగ్ పనులు, గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు, కుడి కాలువ అనుసంధానం పనుల్లో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి వివరాలడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డయాఫ్రంవాల్ నిర్మాణం నేటికి 950 మీటర్ల మేరకు జరిగిందని, 75 శాతం పూర్తయిందని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి కల్లా కొత్త డయాఫ్రం వాల్‌ను పూర్తి చేస్తున్నామని చెప్పారు. రూ.600 కోట్లతో ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తిచేసి 2026 సీజన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మిస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ పనులు కూడా ప్రాజెక్టుతో పాటు పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు, ఆ ర్‌అండ్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఏలూరు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, ఈఎన్‌సీ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సీఓఓ అంగర సతీష్ బాబు, ప్రాజెక్టు జనరల్ మేనేజరు గంగాధర్ పాల్గొన్నారు.


