ఏఆర్ ఏఎస్పీగా మునిరాజా
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా జి.మునిరాజా నియమితులయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ సతీష్, ఆర్‌ఎస్సైలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. 1992లో ఆర్‌ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2000లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. కడప, అనంతపురం, టీటీడీ విజిలెన్స్‌లో విధులు నిర్వర్తించారు. 2010లో ఆయన డీఎస్పీగా పదోన్నతి పొందారు. తిరుపతి ఏఆర్, అనంతపురం ఎస్‌టీఎఫ్, కళ్యాణ డ్యామ్ పీటీసీలో పనిచేశారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగే మెగా పీటీఎం 3.0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం బడుల్లో 1,19,397 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. నూజివీడు జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరవుతారు.
ఏలూరు(మెట్రో): మెగా పీటీఎంను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మెగా పీటీఎంపై ఆమె అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో సమూల సంస్కరణలలో భాగంగా మెగా పీటీఎం నిర్వహణకు శ్రీకారం చుట్టారన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు రైల్వేస్టేషన్ పక్కన ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయాన్ని నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ మాట్లాడుతూ ఎస్సీ బాలుర హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. హాస్టల్ ప్రాంగణంలో మురుగునీరు పేరుకుపోయిందని, ప్రాంగణమంతా బార్‌ను తలపించేలా ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయన్నారు. దీనిపై వార్డెన్‌ను ప్రశ్నిస్తే తనకు తెలియదని బాధ్యతారహితంగా సమాధానం చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు శుభ్రపరచి కొన్ని నెలలు గడిచినట్టుగా ఉందన్నారు. ఏఐఎస్‌ఎఫ్, జిల్లా అధ్యక్షుడు ఈ.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా మని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు తెలియజేశారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్య ఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తిస్థాయి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ వెట్రిసెల్వి ఆయనకు వివరించారు.
జంగారెడ్డిగూడెం: హత్యాయత్నం కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీన మండలంలోని పేరంపేట గ్రామానికి చెందిన కలపాల కోటయ్యను తన పొలంలో కొందరు దాడి చేసి కొట్టారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పేరంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు జంగారెడ్డిగూడెం దళితవాడకు చెందిన ఐదుగురు వ్యక్తులకు కొంత సొమ్ము ముట్టజెప్పి కోటయ్యను హత్య చేసేందుకు పురమాయించినట్లు ఎస్సై చెప్పారు. దీంతో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. పాత గొడవల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లు ఎస్సై తెలిపారు.


