మెగా పీటీఎం.. గురువులకు భారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/నిడమర్రు: చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్, టీచర్ సమావేశాలు (మెగా పీటీఎం) ఉపాధ్యాయులకు భారంగా మారాయి. కార్యక్రమం నిర్వహణకు అరకొర నిధులను కేటాయించడంతో పాటు పండుగలా నిర్వహించాలని ఆదేశించడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠశాలల్లో విద్యావిద్యార్థుల తల్లిదండ్రులను ఒక చోటకు చేర్చి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి మెగా పీటీఎం వేదిక కానుందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. శుక్రవారం నిర్వహించే మెగా పీటీఎంలో స్థానిక రాజకీయ, కూటమి నాయకులకు కూడా స్థానం కల్పించాలని చెప్పడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా తక్కువ బడ్జెట్‌తో కార్యక్రమం నిర్వహించడం సాధ్యం కాదని, తాము ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
అరకొర నిధులతో పండుగ అంటే ఎలా..
పీటీఎంను పండుగలా నిర్వహించాలని చెబుతున్న ప్రభుత్వం చాలా తక్కువ బడ్జెట్ కేటాయించిందని, దీంతో కార్యక్రమం నిర్వహణ అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. కూటమి నేతలను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశాలు రావడంతో వారిని ఎలా సంతృప్తి పరచాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఏ చిన్న తేడా జరిగినా కూటమి నేతలు అధికార దర్పంతో తమను నిలదీసే ప్రమాదముందని గుబులు చెందుతున్నారు.
బడ్జెట్ కేటాయింపు ఇలా..
మెగా పీటీఎంకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. 0 నుంచి 30 మంది పిల్లలు ఉంటే రూ.900, 31 నుంచి 100 మంది ఉంటే రూ.2,250, 101 నుంచి 250 మంది ఉంటే రూ.4,500, 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.6.750 చొప్పున బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు అల్పాహారం, తేనీరు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటుతో పాటు మైక్‌సెట్, ఫ్లెక్సీలు, కుర్చీలు సమకూర్చాలి. ఒక్కో కార్యక్రమానికి సుమారు 100 మంది వచ్చినా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జేబుల్లో డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని చెబుతున్నారు.
1,790 బడులు.. రూ.37 లక్షల బడ్జెట్
జిల్లాలో మొత్తం 1790 పాఠశాలలు ఉన్నాయి. 0–30 పిల్లలు ఉన్నవి 971, 31–100 మంది ఉన్నవి 497, 101–250 మంది ఉన్నవి 208, 251–1,000 మంది ఉన్నవి 112, వెయ్యికి పైగా విద్యార్థులున్నవి రెండు ఉన్నాయి. మొత్తం పీటీఎంల నిర్వహణకు రూ.37,02,150 బడ్జెట్ విద్యాశాఖ కేటాయించింది.
కష్టం.. గురూ !
పీటీఎం నిర్వహణకు అరకొర నిధులు
బడ్జెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన
30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.900 మాత్రమే
జిల్లాకు రూ.37 లక్షల కేటాయింపు
పండుగలా చేయాలంటూ ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం


