విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
పాలకొల్లు సెంట్రల్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి వక్రించింది. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడం సస్పెన్షన్‌కు దారి తీసింది. ఆగర్రు జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆగర్రు జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) సీహెచ్ రవికుమార్ గత నెల 21న హోమ్ వర్క్ చేయలేదనే సాకుతో ఇద్దరు విద్యార్థినులను స్కూల్ భవ నంపైన నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి రమ్మని పిలిచారు. దీంతో ఇద్దరు విద్యార్థినులు పైకి వెళ్లగా.. ఓ విద్యార్థినిని కిందకు వెళ్లి పుస్తకం తీసుకురమ్మని చెప్పారు. ఆ బాలిక కిందకు వెళ్లి పుస్తకం తీసుకుని పైకి వచ్చే సరికి మరో విద్యార్థినితో రవికుమార్ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల వద్ద గొడవ చేయడంతో విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై గత నెల 24, 25వ తేదీల్లో విచారణ చేయగా రవికుమార్ గతంలోనూ చాలా మంది విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించినట్టు తెలిసింది. అనంతరం 26న రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
గోప్యంగా సస్పెన్షన్
గతనెల 26న సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చినా విషయం గోప్యంగా ఉంచారు. గురువారం రవికుమార్‌ను విచారణ చేసిన ఫొటోలు, సస్పెన్షన్ ఉత్తర్వులు బయటకు రావడంతో విషయం బహిర్గతమైంది. దీనిపై వివరణ కోరేందుకు పాలకొల్లు ఎంఈఓను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు. ఆగర్రు హైస్కూల్ ఉపాధ్యాయులకు ఫోన్ చేసినా వారూ స్పందించ లేదు. విచారణ చేసిన ఎంఈఓ–2ను ప్రశ్నిస్తే విచారణ విషయాలు బయట చెప్పకూడదని వివరణ ఇచ్చారు.


