సైబర్ నేరం.. రోజుకో రకం
● సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ స్కామ్‌లు
● డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో లక్షల్లో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సైబర్ నేరాలు రోజుకో రూట్ మారుతున్నాయి. మొన్నమొన్నటి వరకు పార్శిల్ వచ్చిందని, పార్శిల్‌లో మాదక ద్రవ్యాలున్నాయని కస్టమ్స్ పేరుతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసి డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో దందా చేసి నకిలీ ముఠాలు లక్షలు దండుకున్నాయి. కట్‌చేస్తే.. ఏపీకే ఫైల్స్ అంటూ వాట్సాప్‌ల్లో హానికరమైన లింకులు పంపి ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతా గల్లంతు చేసే ముఠాల బారిన అనేకమంది పడ్డారు. ఇక తాజాగా మరోకొత్త సైబర్ మోసం తెరపైకి వచ్చింది. కార్డ్‌డీల్ పేరుతో డిజిటల్ అరెస్ట్ ఖాతా సర్వం ఖాళీ చేసే ముఠాలు దేశవ్యాప్తంగా చెలరేగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేక మంది వీటి బారినపడి లక్షలు నష్టపోయారు. దీనికి ప్రధానంగా సీనియర్ సిటిజన్లనే ఎంపిక చేసుకుంటున్నారు. వారినే టార్గెట్ చేసి సులువుగా మాటలతో బెదిరించి నిమిషాల్లో ఖాతాను ఖాళీ చేస్తున్నారు.
కార్డ్‌డీల్ మోసం ఇలా
సైబర్ మోసాల్లో ప్రస్తుతం కార్డ్ డీల్ మోసం ఎక్కువగా జరుగుతుంది. ఇది కొత్త నేరవిధానం. దీనిలో సైబర్ నేరగాళ్లు బాధితుడిని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెదిరించి నకిలీ సుప్రీంకోర్టు డాక్యుమెంట్లు, క్రిమినల్ కేసుల పేరుతో నకిలీ ఎఫ్‌ఐఆర్ కాపీలు, అరెస్ట్ వారెంట్లు చూపి డబ్బు డిమాండ్ చేస్తారు. దీనికి కంబోడియా దేశంలో ఉన్న ప్రధాన సూత్రధారులు మన దేశంలోని తమ అసోసియేట్స్ ద్వారా కమిషన్లపై బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి నగదును కార్డ్ డీల్ ద్వారా త్వరితగతిన విత్‌డ్రా చేసి మిగిలిన మొత్తాన్ని కంబోడియా ఆపరేటర్లకు బదలాయింపు చేస్తారు. నేరం జరిగిన తరువాత ఎలాంటి ఆధారాలు జరగకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఇలాంటి మోసమే భీమవరంలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.
బాధితులు.. వృద్ధులే : భీమవరం టూటౌన్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రోఫెసర్‌ని బురిడీ కొట్టంచిన ఘటనలో 13 మంది అంతర్జాతీయ సైబర్ ముఠాని అరెస్ట్ చేసి రూ.42 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏలూరులోనూ ఇదే తరహా మోసం గతంలో వెలుగుచూసింది. ఈఏడాది సెప్టెంబర్‌లో ఒక వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం 7 రాష్ట్రాల్లో పోలీసులు జల్లెడపట్టి 8 మందిని అరెస్టు చేశారు. యూపీకి చెందిన సైబర్ నేరగాళ్లు ఒక బ్యాంకు మేనేజర్, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు.


