చంద్రబాబు సర్కారుకు ఉరితాడే
● వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్
● ఏలూరులో జోరుగా కోటి సంతకాల సేకరణ
ఏలూరు టౌన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇదే చంద్రబాబు సర్కారుకు ఉరితాడుగా మారుతుందని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ హెచ్చరించారు. ఏలూరులో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు పెద్దసంఖ్యలో హాజరై కోటి సంతకాల సేకరణలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. వ్యాపారులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారు సంతకాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా సర్వజన ఆసుపత్రులు, నర్సింగ్, ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇక జిల్లా హాస్పిటల్, ఏరియా ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లీనిక్స్‌తో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూడడం నీచమైన ఆలోచన అని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, పైడి భీమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు డింపుల్‌జాబ్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జేవియర్ మాస్టర్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, ఏలూరు లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, లీగల్‌సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


