జగనన్న కాలనీలో డంపింగ్ యార్డు వద్దు
● చెత్త వాహనాలను అడ్డుకున్న కాలనీవాసులు
● కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా
నరసాపురం రూరల్: పట్టణానికి చెందిన చెత్తను జగనన్న లేఅవుట్ కాలనీలో వేయొద్దంటూ కాలనీ వాసులు అడ్డుకున్నారు. గురువారం చెత్తను తీసుకువచ్చిన వాహనాలను అడ్డగించి కూటమి నాయకులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై ఆ ప్రాంతవాసులు బైఠాయించి వంట, వార్పు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ఆర్డీవో దాసిరాజు, కమిషనర్ ఆంజయ్య వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే మా ప్రాంతంలో చెత్తవేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని వారు తెగేసి చెప్పారు. వేములదీవి, రాజుల్లంక, రుస్తుంబాద, తుంగపాటివారి చెరువు, శ్రీహారిపేట, లాకుపేట తదితర ప్రాంతాల్లో చెత్త వేసేందుకు మునిసిపల్ యంత్రాంగం ప్రయత్నించగా అక్కడి ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే. వారంతా కాదన్నారని తమ ప్రాంతంలో చెత్త వేయడం ఎంతవరకూ సమంజసమని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క మంచినీటి ప్రాజక్టు, మరో పక్క విద్యుత్ సబ్‌స్టేషన్ ఉండగా ఈ ప్రాంతంలో చెత్త వేయాలని నిర్వహించడం చంద్రబాబు సర్కారు నాయకులకు తగదని ముక్తకంఠంతో అన్నారు. అఽధికారులు వారి కార్యాలయ ఆవరణలోనే చెత్తను రీ సైక్లింగ్ చేస్తే బావుంటుందని, అన్నారు.


