చిక్కిన సైబర్ నేరగాళ్లు
● పరారీలో ప్రధాన నిందితుడు
● 13 మంది అరెస్ట్, రూ.42 లక్షల నగదు స్వాధీనం
భీమవరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్‌ను బురిడీ కొట్టించి నగదు కాజేసీన సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం భీమవరంలో ఎస్పీ అద్నామ్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్‌తో డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి రూ.78 లక్షలు కాజేశారు. నిందితులు దేశంలోని ఇంటర్నల్ నెట్‌వర్క్‌తో బాధితుడి సొమ్మును బ్యాంక్ ఖాతాలకు రహస్యంగా మళ్లించడానికి కార్డ్ డీల్ పద్ధతిని ఉపయోగించాచారు. దీనిపై బాధితుడు ఈనెల 17వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేంగా 7 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీ కాగా కంబోడియాలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.42 లక్షల నగదుతో పాటు అంతర్జాతీయ సిమ్‌కార్డులతో కూడిన 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోగా వివిధ బ్యాంక్‌ల్లో సుమారు రూ.19.35 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు.
నిందితుల వివరాలు
ప్రధాన నిందితుడు రహత్ జే నయన్(ముంబై) పరారీలో ఉండగా పుట్టగుంపుల శ్రీనివాసచౌదరి(బెంగులూరు), గద్రత్తిచిన్ని బ్లాండినా (హైదరాబాద్), పిల్లి వంశీప్రసాద్ (హైదరాబాద్), గద్రత్తి శ్రీకాంత్ (హైదరాబాద్), తమ్మినేని సునీల్‌కుమార్ (హైదరాబాద్), మామిడి వెంకట రోహిణికుమార్(వైజాగ్), కూరగాయల ఈశ్వర్ (వైజాగ్), కొమ్మినేని అజయ్ (ఖమ్మం), తల్లారి జయచంద్రకుమార్(అనంతపురం), పెద్దన్న మంజునాధ్‌రెడ్డి (శ్రీసత్యసాయిజిల్లా), మంకముత్క వేమనారాయణ (అనంతపురం), ములకల రాజేష్ (అనంతపురం), పంకల హనుమంతరెడ్డి (శ్రీసత్యసాయిజిల్లా)లను ఈనెల 26వ తేదీన విజయవాడ సమీపంలోని గన్నవరంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. కేసును ఛేదించడంలో టూటౌన్ సీఐ జి కాళీచరణ్ ఆధ్వర్యలో వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు, ఆకివీడు సీఐ వి జగదీశ్వరరావు, ఎస్సైలు రెహమాన్, హెచ్ నాగరాజు, ఎం.రవివర్మ, ఎన్.శ్రీనివాసరావు, కేఎం వంశీ తదితర సిబ్బందితో కలసి పనిచేసినట్లు ఎస్పీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో భీమవరం, నరసాపురం డీఎస్పీలు ఆర్‌జీ జయసూర్య, శ్రీవేద పాల్గొన్నారు.


