
సిండికేట్‌మయం.. దోపిడీ పర్వం
కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం దారుణం
● నూజివీడు మున్సిపాలిటీలో ఈ ప్రొక్యూర్‌మెంట్ అభాసుపాలు
● పలువురు కాంట్రాక్టర్లతో విత్‌డ్రాలు
● చోద్యం చూస్తున్న ఇంజినీరింగ్ అధికారులు
నూజివీడు: నూజివీడు పురపాలక సంఘంలో అభివృద్ధి పనులను చేపట్టే విషయంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి దోపిడీ పర్వానికి తెరలేపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు గాను ప్రవేశపెట్టిన ఈ ప్రొక్యూర్‌మెంట్‌కు తూట్లు పొడుస్తూ అభివృద్ధి పనులను ఎవరెవరికి ఇవ్వాలనే విషయమై అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క పంచుకున్నారు. తమ అనుమతి లేకుండా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లతో బలవంతంగా లెటర్లు ఇప్పించి ఉపసంహరించుకునేలా చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
నూజివీడు పురపాలక సంఘం పరిధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.3 కోట్లతో మున్సిపాలిటీ ఇంజినీరింగ్ అధికారులు గత నెలలో 31 పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ప్రజాధనాన్ని దోచుకుంటున్న నేపథ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు గాను ప్రభుత్వాలు ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ కాంట్రాక్టరైనా టెండర్లలో పాల్గొని టెండర్ వేయొచ్చు. అయినప్పటికీ నూజివీడులోని అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కూర్చొని ఈ ప్రొక్యూర్‌మెంట్‌కు తూట్లు పొడుస్తూ వర్కులను పంచుకున్నారు. తమకు ఇష్టం లేని కాంట్రాక్టర్లు ఎవరైనా టెండర్లు వేసి ఉంటే వారిని నయానో భయానో బెదిరించి విత్‌డ్రా చేసుకునేటట్లు చేశారు. దీంతో ఏకపక్ష దోపిడీకి అధికార పార్టీ కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు తెరతీశారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటే ఎవరు తక్కువకి వేస్తారో వారికి వర్కులు ఇస్తారు. నూజివీడు మున్సిపాలిటీలో మాత్రం అలా ఉండదు. అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో వాళ్లు చెప్పిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలి.
టెండర్ల విత్ డ్రా
ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలవుతున్నప్పటికీ నూజివీడు మున్సిపాలిటీలో పంచుకున్నంత దారుణంగా ఇంకెక్కడా పంచుకోరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 31 వర్కులకు రూ.3 కోట్లతో టెండర్లు పిలవగా అందులో 24 వర్కులకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ టెండర్లు వచ్చాయి. కొన్ని పనులకు అయితే ఐదు, నాలుగు, మూడు టెండర్లు సైతం వచ్చాయి. దీంతో అధికారపార్టీ నాయకులు కొందరు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లందరిని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కూర్చోబెట్టి తమకు నచ్చని కాంట్రాక్టర్ల చేత విత్‌డ్రా చేయించారు. విత్‌డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లందరూ ప్రస్తుతం వర్కులు దక్కించుకున్న వారి కంటే లెస్‌కు టెండర్లు వేసిన వారే. వారు విత్‌డ్రా చేసుకోకుండా ఉంటే ప్రజాధానం ఆదా అయ్యేది. టెక్నికల్ బిడ్ తెరిచేవరకు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ బిడ్ తెరిచే ముందు వారితో విత్‌డ్రా లెటర్లు తీసుకోవడం గమనార్హం.
ఇంత దారుణంగా ప్రజాధానాన్ని దోచుకునేందుకు కాంట్రాక్టర్లు సిద్ధపడితే వారికి ఇంజినీరింగ్ విభాగం అధికారులు వత్తాసు పలకడం గమనార్హం. సిండికేట్ అయ్యారని కళ్లకు కట్టినట్లు కనబడుతుంటే టెండర్లను ఎలా ఆమోదించారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అధికారులు సైతం కంచే చేను మేసిన విధంగా మిన్నకుండటం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రజాధనం దోపిడీ కాకుండా అడ్డుకోవాలని పలు రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.