
సాంస్కృతిక ఉత్సవాల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: విజయవాడలో ఈనెల 17న నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కళల విభాగం విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఆరు విభాగాల్లో బహుమతులు సాధించారు. వ్యక్తిగత విభాగంలో మృదంగంలో సీహెచ్ సుధా ప్రణీత్, బీ గాయత్రి ప్రథమ, ద్వితీయ స్థానాల్లోను, కూచిపూడి నృత్యంలో యూ డాలీ నాగమైత్రి తృతీయస్థానంలో నిలిచారు. బృంద విభాగంలో జానపద వాద్య సమ్మేళనం విభాగంలో పీ కార్తీక్ బృందం ప్రథమ స్థానంలోను, బృందగానం విభాగంలో ఎం శేఖర్, ఎం అనూష బృందం ప్రథమ స్థానంలోను, లఘునాటికలో అంతిమ సంస్కారం అనే స్కిట్‌కు ఏవీఎన్ సాయితేజ బృందానికి ద్వితీయ స్థానం లభించింది. మొత్తం ఆరు విభాగాలలో కలిపి రూ.36 వేల నగదు బహుమతిని విజేతలు అందుకున్నారు. సంగీత విభాగం హెచ్‌ఓడీ జినగం చంద్రమౌళి ఆధ్వర్యంలో విజేతలను, ఈ ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులను, విభాగపు అధ్యాపకులు మంగళగిరి శ్రీధర్, బంకుపల్లి వెంకట విద్యాసాగర్‌లను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ అభినందించారు.