
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
దెందులూరు: ప్రయాణంలో ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలోని ఆశ్రం హాస్పిటల్‌లో ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రం హాస్పిటల్ నుంచి పాత బస్టాండ్, జూట్ మిల్లు, ఫైర్‌స్టేషన్, సత్రంపాడు, సీఆర్‌ఆర్ మహిళా కళాశాల, కలపర్రు మీదగా హనుమాన్ జంక్షన్ వరకు 200 మంది బైక్ ర్యాలీ చేపట్టగా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యం రహదారిపై మనతోపాటు ఎదుటి వారిని సైతం ప్రమాదంలో పడేస్తుందన్నారు. ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టం రాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటుచేసి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆశ్రం ఆస్పత్రి సీఈఓ హనుమంతరావు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తమ వైద్యశాఖలో మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ ప్రాణయ్, సీఈఓ రాజరాజన్, మెడికల్ సూపరింటెండెంట్ శాంతయ్య, ఆస్పత్రి సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శివకిషోర్