
బాలికలు అభివృద్ధి పథంలో సాగాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలికలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గవరవరం సెంట్ ఆన్స్ మహిళా కళాశాలలో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య అనే ఆయుధంతో ప్రతి బాలిక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నవ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. మహిళలు, బాలికలు స్వీయ రక్షణ నైపుణ్యాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 14 మంది బాలికలను ప్రశంశాపత్రాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, ఐసీడీఎస్ ఆర్జేడీ బి.సుజాతారాణి, పీడీ ఎ.శారద, డీఎంహెచ్‌ఓ పీజే అమృతం, డీఈఓ ఎం.వెంకలక్ష్మమ్మ, జిల్లా శిశుసంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.