
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ద్వారకాతిరుమల: పొలంలోని మోటారు వద్ద ఫ్యూజ్ తీస్తున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కోడిగూడెంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దొరసానిపాడుకు చెందిన మానుకొండ విలియమ్స్(20) దెందులూరు ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలకు సెలవు పెట్టి, కోడిగూడెంలో ఆయిల్‌పామ్ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. పని పూర్తయిన తరువాత మోటారును ఆఫ్ చేసే ప్రయత్నంలో స్విచ్ లేకపోవడంతో, ఫ్యూజ్‌ను తీస్తున్నాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విలియమ్స్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ఏలూరు (టూటౌన్) : అత్యాచార యత్నం కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఏలూరు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీ కృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన కేసులో దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన మాండ్రు వెంకట ఆనంద్‌కు శిక్షను ఖరారు చేశారు. కొయ్యలగూడెం పీఎస్‌లో అప్పట్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.