
100 ఏళ్ల రావిచెట్టు నరికివేత
టి.నరసాపురం: ఒక వ్యక్తి స్వార్థం కోసం వందేళ్ల పైబడిన రావిచెట్టు నేలకొరిగింది. మండలంలో మక్కినవారిగూడెం పంచాయతీ కొల్లివారిగూడెం రెవెన్యూ గ్రామంలో రావిచెట్టును ఓ రైతు నిబంధనలకు విరుద్దంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నరికి కలపను ట్రాక్టర్‌పై తరలించాడు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లి వారిగూడెం పరిధిలో ముత్యాలమ్మ గుడి బండి దారి భూమి సుమారు 70 సెంట్లు ఉంది. ఈ భూమిని కొంతకాలంగా ఒక వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడు. అతను మరో వ్యక్తికి ఆ భూమిని కౌలుకు ఇచ్చినట్లు సమాచారం. కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆ భూమిలో ఉన్న 100 ఏళ్ల రావిచెట్టును నరికి ట్రాక్టర్‌పై తరలించాడు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని, కలపను స్వాధీనం చేసుకుని ఆక్షన్ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.