
కాట్రేనిపాడు పేదలకు న్యాయం చేయాలి
ముసునూరు: కాట్రేనిపాడు పేదలకు న్యాయం చేయాలని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. పేదలు నివాసం ఉంటున్న స్థలాలు 2007వ సంవత్సరంలో ఇండ్ల స్థలాలు మంజూరుకు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసేందుకు, లబ్ధిదారుల వాటాతో కలిపి రైతులకు చెల్లించారు. అప్పటి పంచాయతీ పాలకులు తీర్మానం ఇవ్వకపోవడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. కాగా ఇటీవల తహసీల్దార్ ఆదేశాలంటూ శుక్రవారం సాయంత్రానికి ఇండ్ల స్థలాలు ఖాళీ చేయాలని, లేకుంటే జేసీబీలతో కూల్చి వేస్తామని, స్థానిక వీఆర్‌ఓ పేదలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పేదలు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయించగా ఆయన విషయాన్ని నూజివీడు సబ్ కలెక్టర్‌కు తెలియజేశారు. కనీసం పేదలకు నోటీసులు జారీ చేయకుండా, పురుషులు ఇండ్ల వద్ద లేని సమయంలో వచ్చి మహిళలను స్థలాలు ఖాళీ చేయాలని బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయించమనడం సబబు కాదని వర్షాకాలంలో ఇటువంటి పనులు తగదని అన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు, గతంలో రైతులకు లబ్ధిదారు వాటా చెల్లించిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శ
కాట్రేనిపాడులో గురువారం కలపాల పోతురాజు అనే వ్యక్తి ఇంటిలో గ్యాస్ సిలిండర్ల పేలుడుతో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, జెడ్పీటీసీ డా.వరికూటి.ప్రతాప్, ఏపీ స్టేట్ ఎస్సీ సెల్ సెక్రటరీ కంబాల రాంబాబు, మాజీ సర్పంచ్ సొంగా వెంకటేశ్వరరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు రాజా వర ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు