
ట్రిపుల్ ఐటీలో మ్యూజిక్ వర్క్‌షాప్ నిర్వహణ
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో గురువారం సంగీత విభాగం ఆధ్వర్యంలో మ్యూజిక్‌పై వర్క్‌షాపును నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రముఖ గాత్ర విద్వాంసురాలు, సంగీత సుధానిధి వీ లలితా చంద్రశేఖర్ పాల్గొని భారతీయ సంగీతంలోని ప్రాథమిక అంశాలు, విద్యార్థులకు కలిగే ఉపయోగాలు అనే అంశంపై ఉపన్యసించారు. దేశంలో ముఖ్యంగా హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలున్నాయన్నారు. సంగీతంలో స్వరాలు, రాగాలు ముఖ్యమైనవని, భావాలను, మానసిక స్థితిని వ్యక్తపరచడానికి రాగాలను ఉపయోగిస్తారన్నారు. సంగీతం వినడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలగడం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెరగడం, జ్ఞాపకశక్తి మెరుగుపడటం, క్రమశిక్షణ అలవడటంతో పాటు విద్యార్థులకు విద్యాపరమైన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం సంగీత కచేరీ చేస్తూ కచేరీ పద్ధతిపై సోదాహరణగా వివరించారు. వీరికి వయోలిన్‌పై జే చంద్రమౌళి, మృదంగంతో మంగళగిరి శ్రీధర్ తమ సహకారాన్ని అందజేశారు. లలిత విద్యార్థులకు దీక్షితార్ నోటు స్వరం నేర్పించారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, సంగీత విభాగం హెచ్‌ఓడీ జే చంద్రమౌళీ తదితరులు పాల్గొన్నారు.