
‘సాక్షి’పై కూటమి కుట్రలు
పత్రికా స్వేచ్ఛను హరించవద్దు
● నేడు జర్నలిస్ట్, ప్రజాసంఘాలతో ధర్నాలు
● దాడులను నిరసిస్తూ అధికారులకు వినతులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందుంచుతున్న పత్రికలు, మీడియాపై అక్రమంగా కేసులు బనాయిస్తూ మీడియాను నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో రాష్ట్రంలో నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను ప్రచురిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుండటాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేక సాక్షి దినపత్రిక ఎడిటర్ పై అక్రమంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. ఈ కేసులను ఆసరాగా చేసుకుని పోలీసులను సాక్షి కార్యాలయాలపైకి ఉసిగొల్పి సోదాలు, విచారణల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అవినీతిపై వార్తలు ప్రచురించే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై కేసులు బనాయించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధిక్కరించి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ప్రజాసంఘాల ప్రతినిధులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాను అణగదొక్కే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో పాటు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, ఎస్‌పీ సర్పంచులసంఘ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పత్రిక అద్దం వంటిది. సమాజంలో జరిగే మంచి, చెడులను చూపిస్తుంది. నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాలరాయడమే. బాధ్యత కలిగిన పౌరులంతా ఇటువంటి చర్యలను ఖండించాలి.
– మహమ్మద్ గాలిబ్‌బాబు,
న్యాయవాది, కై కలూరు