
ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ మేరకు ఆక్వా చెరువుల అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆక్వా సాగులో ఉన్న పది మండలాల్లో గ్రామాల వారీగా సమీక్షించారు. కనీసం 50 శాతం పూర్తి చేయలేక పోయారని కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తి చేయని అధికారులు, అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తానని కలెక్టరు హెచ్చరించారు. కలెక్టరు మాట్లాడుతూ మొత్తం పది మండలాల్లో 1,49,828 ఎకరాలు ఉండగా ఇంతవరకూ 52,613 ఎకరాల రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తయిందని, మిగతా త్వరగా పూర్తి చేయాలన్నారు. కొల్లేరు భూములు వైల్డ్ లైఫ్ పరిధిలో ఉన్నాయని వాటిని లైసెన్స్ ఇవ్వరాదన్నారు. సమావేశంలో విజయవాడ మత్స్యశాఖ కమిషరు కార్యాలయం జాయింటు డైరెక్టరు షేక్ లాల్ మహమ్మద్, జిల్లా మత్స్యశాఖ డీడీ బి.నర్సయ్య, సహాయ సంచాలకులు బి.రాజ్‌కుమార్, కె.రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
హేలాపురి ఉత్సవం సందర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ద్వారా తీసుకువచ్చిన సంస్కరణలతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రతినెల కొంత ఆదాయం పొందుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పండుగ వాతావరణంలో జరిగిన హేలాపురి ఉత్సవం గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్‌ను కలెక్టర్ సందర్శించారు.