
క్షేత్ర రహదారికి మరమ్మతులంటూ.. మాయ
ద్వారకాతిరుమల: భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారికి మరమ్మతులంటూ.. కొందరు మాయ చేస్తున్నారు. లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు మార్జిన్‌ను బుధవారం ఆర్‌అండ్‌బీ అధికారులు శుభ్రం చేయగా, కొందరు కూటమి నాయకులు రోడ్డుకు మరమ్మతు పనులు ప్రారంభం అయ్యాయంటూ ప్రచారానికి తెరతీశారు. అయితే రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చకుండా ఇలా మార్జిన్‌లలోని మట్టిని, చెత్తను పక్కకు నెడితే ఉపయోగం ఏమిటని, వీటిని మరమ్మతులని ఎలా అంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, లక్ష్మీపురం విర్డ్ ఆస్పత్రి వద్ద, ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ యార్డు ఎదురుగా రోడ్డుపై ప్రమాదాలకు నిలయమైన గోతులను పూడ్చి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డుపై గోతులు పూడ్చకుండా మార్జిన్ శుభ్రం చేసిన వైనం