
కోర్టు ఉత్తర్వులు భేఖాతర్
కొయ్యలగూడెం: కోర్టు ఉత్తర్వులను సైతం భేఖాతర్ చేస్తూ కొందరు వ్యక్తులు ఓ రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకోవడం వివాదాస్పదమైంది. రాజవరం, తిరుమలాపురం గ్రామాల సరిహద్దులో 595/1 594/2 సర్వే నంబర్లకు సంబంధించిన భూమి బుధవారం వివాదాస్పదంగా మారింది. రాజవరానికి చెందిన రైతు దాసరి విష్ణు పేర్కొన్న వివరాల ప్రకారం గత 20 ఏళ్లుగా వివాదంలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమి విషయంపై 2024వ సంవత్సరం కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వెలువడిందని అన్నారు. ఇందుకు సంబంధించి పోలీసు ప్రొటెక్షన్‌తో డెలివరీ ఆర్డర్ కూడా తీసుకున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులకు కోర్టు స్టేఆర్డర్ ఇవ్వనప్పటికీ తన పొలంలోకి వచ్చి తరచూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అడుగుతున్నారని అన్నారు. గతంలోనే తాము పోలీసు ప్రొటెక్షన్‌తో కూడిన డెలివరీ ఆర్డర్స్ అందజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. దీన్ని అలుసుగా తీసుకొని ఆక్రమణదారులు పేట్రేగిపోయారని గత మార్చి నెలలో దౌర్జన్యంగా తన పొలంలోకి ప్రవేశించడమే కాకుండా పంటను తరలించుకుపోయారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తనపై దౌర్జన్యం చేసి తన పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుల అండదండలతో తన పొలాన్ని ఆక్రమించుకోవడానికి ఇరువురు వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరిని అడ్డం పెట్టుకొని, అలాగే కొందరు నేరచరిత్ర కలిగిన కిరాయి వ్యక్తులను వెంటపెట్టుకొని బుధవారం తన పొలంలోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పనులు కొనసాగుతుండగా వాటిని అడ్డుకొని కూలీలపై దౌర్జన్యం చేశారని, పనులు నిర్వహించకుండా ఆటంకం కలిగించారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్స్‌ని సైతం ధిక్కరిస్తూ తన భూమిని కాజేయడానికి సదరు వ్యక్తులు అరాచకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
రైతు భూమి ఆక్రమణకు దౌర్జన్యం