
రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని పాలకొల్లు – నరసాపురం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన శివకోటి అప్పారావు (65) బుధవారం తన ద్విచక్ర వాహనంపై నరసాపురం వెళ్లి పాలకొల్లు వస్తుండగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివకోటి బాల సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేశారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పరిమితిని యూజీసీ నిబంధనల మాదిరిగానే 62 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వేసిన రిట్‌లపై విచారణ ఈ నెల 13న జరిగింది. కోర్టు ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈ నెల మూడో వారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంతో ఉద్యాన వర్సిటీ వీసీ నియామక వ్యవహారం ముడిపడి ఉండటంతో, వర్సిటీలోని వీసీ కుర్చీ 45 రోజులుగా ఖాళీగానే ఉంది.
భీమవరం: పట్టణంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ బీవీ రాజు జయంతి సందర్భంగా బుధవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బీవీ రాజు పాఠశాలలోని ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు రూ.83 వేలు స్కాలర్‌షిప్‌లు అందించారు. భీమవరం, శృంగవృక్షంలోని లెప్రసీ రోగులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని సెంట్‌మేరీస్ లెప్రసీ సెంటర్‌లోని ఎయిడ్స్, టీబీ, లెప్రసీ రోగులకు రూ.60 వేలు విలువైన మందులతోపాటు 250 మందికి బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. విష్ణు విద్యాసంస్థల విద్యార్థులు ఏఎస్‌ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్‌లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి