
వివాదాస్పద క్యూలైన్ నిర్మాణంపై విచారణకు ఆదేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో దర్శనం క్యూలైన్ల నిర్మాణాలు చేపట్టడం ఆగమశాస్త్ర విరుద్ధమంటూ ఇటీవల ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయవాది బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తిని విచారణకు ఆదేశించినట్టు దేవదాయ శాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్ సోమవారం తనకు మెమో ద్వారా తెలియజేసినట్టు అయ్యంగార్ తెలిపారు. విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వివరణాత్మక నివేదికను ఈఓ నుంచి కోరినట్టు అందులో పేర్కొన్నారన్నారు. తాను చేసిన ఫిర్యాదులో అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించాలని, స్థానాచార్యులను నియమించాలని, స్వామివారికి వినియోగించిన నిర్మాల్య పుష్పాలతో అగరుబత్తీల తయారీ ఆగమ విరుద్ధమని, అంతరాలయ మండపం ఎదురుగా ఆంజనేయస్వామి, గరుడాళ్వార్‌లు చేస్తున్న నమస్కారం శ్రీవారికి కాకుండా భక్తుల పాదాలకు చేస్తున్నట్టుగా ఉందని, కుచ్చుల మెట్టపై ఉత్సవాన్ని, పొన్నచెట్టు వాహన సేవను పునరుద్ధరించాలన్న అంశాలపై సైతం విచారణకు ఈఓను ఆదేశించినట్టు అయ్యంగార్ తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని, హిందూ ఆలయాల్లో ఆచార సంప్రదాయాలను కాపాడలన్న ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తూతూ మంత్రంగా విచారణ జరిపి, తప్పులను కప్పిపుచ్చాలని చూస్తే మఠాధిపతులతో ఆలయం వద్ద ఆందోళనకు దిగుతానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని న్యాయవాది అయ్యంగార్ తెలిపారు.