
జేసీగా అభిషేక్ గౌడ బాధ్యతల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా ఎం.జె.అభిషేక్ గౌడ సోమవారం పదవీ బాధ్య తలు చేపట్టారు. అనంతరం కలెక్టరు కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టరును జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ కలిసి స్వాగతం పలికారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రెండ్రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు రావద్దని, చెట్ల కింద, శిథిల భవనాల వద్ద నిలబడవద్దని, ఉరుముల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల కారణంగా పొంగుతున్న కాజ్‌వేలు, కల్వర్ట్‌లు, వాగులు దాటవద్దని, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉండి: జిల్లాలోని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంటలోని ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ డీఏ వేణుగోపాల్ పత్రికా ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని రసీదు పొందాలని సూచిం చారు. వివరాలకు 08816 297093, 96664 07468 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
భీమవరం: మునిసిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా నవంబరు 3 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయుసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డికి అందచేసిన సందర్భంగా మాట్లాడారు. మృతి చెందిన, రిటైర్డు, అవుట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని, 12వ పీఆర్సీ ప్రకటించి 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, పెరిగిన జనాభా కనుగుణంగా కార్మికుల నిష్పత్తిని పెంచాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 62 ఏళ్లకు పదవీవిరమణ వయస్సును పొడిగించాలని, సులభ్ నిర్వహణ మునిసిపల్ కార్మికులకు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా భీమవరం సర్ సీవీ రామన్ స్కూల్లో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు పోస్టల్ సంక్షేమ పథకాలపై అవగాహన, కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్ యూనియన్ లీడర్ లెనిన్ బాబు మాట్లాడుతూ తపాలా శాఖ ప్రస్తుతం నూతన సాంకేతికత వినియోగించుకుంటూ కొత్త సేవల ద్వారా ప్రజలకు సేవలందిస్తుందని, పోస్టల్ శాఖలో అందించే సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. స్కూల్ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ కె.పార్వతి, ఉపాధ్యాయులు ఎం.శైలజ, ఎన్.రాధా తదితరులు పాల్గొన్నారు.

జేసీగా అభిషేక్ గౌడ బాధ్యతల స్వీకరణ